రాష్ట్రంలో తలసరి కరెంట్ వాడకం 2,126 కిలోవాట్లు 

రాష్ట్రంలో తలసరి కరెంట్ వాడకం 2,126 కిలోవాట్లు 
  • టీఎస్​జెన్​కో నుంచి సర్కారు కొంటున్నది 49 శాతమే
  • 70% మంది పిల్లలు,53% మంది గర్భిణులకు రక్తహీనత 
  • తెలంగాణ స్టాటిస్టికల్ అబ్​స్ట్రాక్ట్​లో వెల్లడి 
  • కౌలు రైతుల లెక్కలు మాత్రం చెప్పలే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరెంట్ మిగులు ఉందని చెప్తున్న ప్రభుత్వం.. చాలా వరకు ప్రైవేట్ జెన్​కోల నుంచే కొంటున్నది. దాదాపు 36.1 శాతం కరెంట్​ను ప్రైవేట్ కంపెనీల నుంచే కొనుగోలు చేస్తున్నది. బుధవారం రాష్ట్ర సర్కారు విడుదల చేసిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్​స్ట్రాక్ట్ 2022 (అట్లాస్)లో ఈ విషయం వెల్లడైంది. రాష్ట్రంలో 17,667 మెగావాట్ల కరెంట్ లభ్యత ఉందని అట్లాస్​లో పేర్కొన్న సర్కార్.. 6,385 మెగావాట్ల కరెంట్​ను ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకుంటున్నట్టు తెలిపింది.

టీఎస్​జెన్​కో నుంచి 6,485 మెగావాట్ల కరెంట్(49.7%) కొంటున్నట్టు వెల్లడించింది. సెంట్రల్ సంస్థల నుంచి తెలంగాణ వాటాగా మరో 2,496 మెగావాట్ల కరెంట్ వస్తున్నది. అయితే, టీఎస్​జెన్​కో ఉత్పత్తి చేస్తున్న కరెంట్ లో అత్యధికంగా థర్మల్ పవర్ 62.33 శాతం (4,042 మెగావాట్లు) మేరకు ఉంది. మరో 37.48 శాతం (2,442 మెగావాట్లు) కరెంట్ నీళ్ల ద్వారా తయారవుతున్నది. ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకుంటున్న విద్యుత్​లో అత్యధికంగా సోలార్ పవరే 69.4 శాతం (4,432 మెగావాట్లు) ఉండడం విశేషం. ఇక రాష్ట్రంలో తలసరి కరెంట్ వాడకం 2,126 కిలోవాట్లుగా ఉన్నట్టు సర్కారు పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 1.74 కోట్ల కనెక్షన్లు ఉన్నాయని, అందులో 72.14 శాతం ఇండ్లు, 15.49 శాతం వ్యవసాయం, 12.35 శాతం పరిశ్రమలకు సంబంధించిన కనెక్షన్లు ఉన్నాయని వెల్లడించింది.   

కొత్తగా సాగులోకి19.48 లక్షల ఎకరాలు 

రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల ద్వారా 90,34,749 ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించి.. 27,87,173 ఎకరాలను స్థిరీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. 40,80,627 ఎకరాలకే నీళ్లిచ్చామని.. 15,20,542 ఎకరాలను స్థిరీకరించామని ప్రభుత్వం తెలిపింది. ఇం దులో కొత్త ప్రాజెక్టుల ద్వారా 69,02,138 ఎక రాలకు నీళ్లిచ్చి.. 26,94,589 ఎకరాలను స్థిరీకరించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నా.. ఇప్పటివరకు 19,48,016 ఎకరాలు మాత్రమే కొత్తగా సాగులోకి వచ్చాయని పేర్కొంది. 14,27,958 ఎకరాలను స్థిరీకరించామని తెలిపింది. రాష్ట్రంలో ప్రాజెక్టులు, బావులు, బోరుబావుల ద్వారా 20 22లో మొత్తం 1.35 కోట్ల ఎకరాలు (ఖరీఫ్​లో 82.1 లక్షల ఎకరాలు, యాసంగిలో 53.5 లక్షల ఎకరాలు కలిపి) సాగవుతున్నాయని తెలిపింది. 2014–15లో కేవలం 62.48 లక్షల ఎకరాలే (ఖరీఫ్​లో 37.02 లక్షలు, యాసంగిలో 25.46 లక్షల ఎకరాలు) సాగులో ఉన్నామని పేర్కొంది.  

కౌలు రైతుల లెక్కేది? 

రాష్ట్రంలో 59.48 లక్షల మంది రైతులున్నట్టు సర్కారు వెల్లడించింది. అందులో 2.47 ఎకరాలలోపున్న సన్నకారు రైతులు (మార్జినల్ ఫార్మర్స్) 38.4 లక్షల మంది ఉండగా, వారి దగ్గర 42.16 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. 2.48 నుంచి 4.94 ఎకరాల వరకున్న చిన్న రైతులు14.09 లక్షల మంది ఉండగా, వాళ్ల దగ్గర 48.85 లక్షల ఎకరాల భూమి ఉంది. 4.95 నుంచి 9.88 ఎకరాల భూమి ఉన్న  రైతులు 5.64 లక్షల మంది ఉండగా.. వారి దగ్గర 36.25 లక్షల ఎకరాల భూమి ఉన్నట్టు సర్కారు పేర్కొంది. 9.89 నుంచి 24.77 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 1.26 లక్షల మంది ఉండగా.. వారికి17 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇక 24.78 ఎకరాలకుపైగా ఉన్న బడా రైతులు 9 వేల మంది ఉండగా.. వారి వద్ద 3.34 లక్షల ఎకరాల భూమి ఉన్నట్టు రిపోర్ట్ వెల్లడించింది. అయితే, ఎక్కడా కౌలు రైతుల ప్రస్తావనను మాత్రం తీసుకురాలేదు. వారెంత మంది ఉన్నారన్న లెక్కను కూడా రిపోర్ట్​లో పేర్కొనలేదు.   

70% మంది పిల్లలకు ఎనీమియా   

రాష్ట్ర తలసరి ఆదాయం ఎనిమిదేండ్లలో రెట్టింపు అయినట్టు అబ్​స్ట్రాక్ట్​లో సర్కారు పేర్కొంది. 2014–15లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,24,104గా ఉండేదని, 2021–2022లో అది రూ.2,75,443కు పెరిగిందని వెల్లడించింది. దేశ తలసరి ఆదాయం రూ.1.5 లక్షలతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1.25 లక్షలు ఎక్కువని చెప్పింది. రాష్ట్ర జీఎస్ డీపీ రూ.11,48,115 కోట్లు అని, అంతకుముందు ఏడాదితో పోలిస్తే 19.4% వృద్ధి నమోదైందని పేర్కొంది. అలాగే రాష్ట్రంలో ఐదేండ్లలోపు పిల్లలు19,79,139 మంది ఉండగా.. అందులో 1,20,447 మందికి పోషకాహారలోపం ఉన్నట్టు సర్కారు వెల్లడించింది. 70 శాతం మంది పిల్లలు,53.2 శాతం మంది గర్భిణులు, 57.6 శాతం మంది మామూలు మహిళలకు రక్తహీనత సమస్య ఉన్నట్టు తెలిపింది.  

తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రం: వినోద్ కుమార్​ 

తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం కాదని, ఆల్రెడీ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదిగిందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి. వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం ఎనిమిదేండ్లలోనే రెట్టింపు అయిందన్నారు. రాష్ట్రంలో కరెంట్ మిగులు ఉందని, భవిష్యత్​లో అది మరింత ఎక్కువ అవుతుందన్నారు. కరెంట్ డిమాండ్ ఎంత పెరిగినా సరఫరా చేస్తామన్నారు. బుధవారం హైదరాబాద్​లోని అర్థ గణాంక శాఖ భవన్​లో తెలంగాణ స్టాటిస్టికల్ అబ్​స్ట్రాక్ట్​-2022ను విడుదల చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. ఇప్పుడు కరెంట్​ను వేరే రాష్ట్రాలకు అమ్మే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. రాష్ట్ర అక్షరాస్యత రేటు దేశ సగటును దాటిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులతో పంటలు బాగా పండుతున్నాయని, వ్యవసాయంలో పంజాబ్, హర్యానా తర్వాత మూడో స్థానంలో ఉన్నామన్నారు.