
- గ్రామాలకే పరిమితం.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉండదు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. షెడ్యూల్ విడుదలైన సమయం నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఈ నియమావళి వర్తిస్తుంది.
దీని ప్రకారం.. ప్రభుత్వం లేదా పాలక పక్షానికి చెందిన నాయకులు కొత్త పథకాలను ప్రకటించడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలు చేపట్టడానికి వీలు లేదు. జిల్లా కలెక్టర్లు, స్థానిక ఎన్నికల అధికారులు కోడ్ అమలును పర్యవేక్షిస్తారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ, సాధారణ పరిపాలనలో ప్రజలకు అందించే సేవలు నిలిచిపోవని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ముఖ్యంగా, ఎన్నికల ప్రకటనకు ముందే ప్రారంభించిన, మంజూరైన పాత పథకాలు, అభివృద్ధి పనుల కొనసాగింపునకు ఎటువంటి ఆటంకం ఉండదని తెలిపింది.
అయితే, ప్రభుత్వ ఖర్చుతో కొత్త పనులకు శ్రీకారం చుట్టడం, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ వాహనాల్లో ప్రచారానికి వెళ్లడం వంటి వాటిపై కోడ్ పరిమితులు ఉంటాయంది. స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో కోడ్ కేవలం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఇది వర్తించదు. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం యథావిధిగా పాలనా వ్యవహారాలు కొనసాగించుకోవచ్చునని ఎస్ఈసీ అధికారులు తెలిపారు.
కొనసాగనున్న ఇద్దరు పిల్లల నిబంధన
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయదలిచిన అభ్యర్థుల అర్హతకు సంబంధించిన నిబంధనల్లో ఎలాంటి సడలింపు లేదు. ముఖ్యంగా, అభ్యర్థులకు సంబంధించి గతంలో అమలులో ఉన్న ‘ఇద్దరు పిల్లల నిబంధన’ కొనసాగనుంది. పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21(3) స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారు అనర్హులు. అయితే ఒకే కాన్పులో కవలలు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు జన్మించి, దాంతో పిల్లల సంఖ్య ఇద్దరి కంటే పెరిగితే, ఆ కాన్పును ఒకే సంతానంగా పరిగణిస్తారు (చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం). మరోవైపు ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ సంతానం లిమిట్ ఎత్తివేశారు.
2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిన కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయాన్ని టచ్ చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా దీన్ని మార్చలేదు. ఈ నిబంధనను మార్చి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలు కోరాయి. అయితే అది కార్యరూపం దాల్చలేదు.