కృష్ణా బేసిన్​లో నీటిని తీసుకోకుండా ఏపీని కట్టడి చేయండి

కృష్ణా బేసిన్​లో నీటిని తీసుకోకుండా  ఏపీని కట్టడి చేయండి

హైదరాబాద్, వెలుగు : కృష్ణా బేసిన్​లో ఆంధ్రప్రదేశ్​ఇప్పటికే కోటాకు మించి నీళ్లు తరలించుకుందని, ఇకపై తీసుకోకుండా కట్టడి చేయాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్​ శివ్​నందన్​కుమార్​కు శుక్రవారం తెలంగాణ ఈఎన్సీ మురళీధర్​లేఖ రాశారు. ఈ నెల రెండో తేదీ వరకు కృష్ణా బేసిన్​లో ఏపీ 71.71 టీఎంసీలు వినియోగించుకోగా.. ఆ రాష్ట్రంలోని రిజర్వాయర్లలో ఇంకా 46.68 టీఎంసీలు నిల్వ ఉన్నాయని తెలిపారు. తెలంగాణ 22.21 టీఎంసీలను వినియోగించుకుందని, తమ రాష్ట్రంలోని రిజర్వాయర్లలో 11.79 టీఎంసీలు నిల్వ ఉన్నాయని తెలిపారు. కృష్ణా జలాల్లో రెండు రాష్ట్రాలకు చెరి సగం వాటా లెక్కన చూస్తే ఏపీ 67.35 టీఎంసీలను అదనంగా తీసుకోగా, తాము నిరుడు నిల్వ ఉంచుకున్న 18.70 టీఎంసీలను కలుపుకుని 87.48 టీఎంసీల వాటా దక్కుతుందని వివరించారు. ఈ అంశంపై తదుపరి త్రీమెంబర్ ​కమిటీ సమావేశంలో చర్చించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా బేసిన్​లోని ప్రాజెక్టుల్లో పెద్దగా నీటి నిల్వలు లేనందున ఇకపై ఏపీ నీళ్లు తరలించకుండా చూడాలని కోరారు.

11న కేఆర్ఎంబీ త్రీమెంబర్​ కమిటీ మీటింగ్

శ్రీశైలం, నాగార్జున సాగర్​ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ, తెలంగాణ సమర్పించిన ఇండెంట్లపై చర్చించేందుకు ఈనెల 11న కేఆర్ఎంబీ త్రీమెంబర్​కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. సాగు, తాగునీటి అవసరాలకు 38.73 టీఎంసీలు వినియోగించుకునేందుకు అనుమతివ్వాలని కోరుతూ తెలంగాణ ఇండెంట్​సమర్పించగా, ఏపీ 30.09 టీఎంసీలు ఇవ్వాలని కోరింది. ఆగస్టు 21న కేఆర్ఎంబీ మెంబర్​సెక్రటరీ డీఎం రాయ్​పురే అధ్యక్షతన నిర్వహించిన త్రీమెంబర్​ కమిటీ సమావేశానికి తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ​హాజరుకాలేదు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తెలంగాణ తప్పుబట్టింది. ఈనేపథ్యంలో 11న జరిగే సమావేశం కీలకం కానుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్​లో నీటి నిల్వలు లేకపోవడంతో రెండు రాష్ట్రాల నీటి వినియోగానికి అనుమతి ఇస్తారా? లేదా? అనేదానిపై ఆసక్తి నెలకొంది.