వ్యాక్సిన్‌ వేస్తలేరు: రాష్ట్రవ్యాప్తంగా టీకాలకు కొరత

వ్యాక్సిన్‌ వేస్తలేరు: రాష్ట్రవ్యాప్తంగా టీకాలకు కొరత
  • రాష్ట్రవ్యాప్తంగా టీకాలకు కొరత సెంటర్ల దగ్గర నో స్టాక్ బోర్డులు
  •  వారం రోజుల నుంచి సప్లైలో ఇబ్బందులు
  •  జిల్లాలకు డోసులు రావట్లేదంటున్న ఆఫీసర్లు 
  •   హైదరాబాద్‌లోనూ దొరకట్లే
  •   సెకండ్ డోస్ కోసం పోటెత్తుతున్న జనం 

  వ్యాక్సిన్‌ కోసం ఆందోళనలు, సెంటర్లపై దాడులు 

నల్గొండ/నెట్‌వర్క్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కరోనా వ్యాక్సిన్‌ కొరత ఏర్పడింది. దాదాపు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో టీకా నిల్వలు అయిపోయాయి. గత వారం నుంచే వ్యాక్సిన్‌ సప్లైలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్ నుంచి సరిపడా వయల్స్ సప్లై కావట్లేదని డాక్టర్లు, స్టాఫ్ చెబుతున్నారు. ఎప్పుడు వస్తాయో అర్థం కాక జనాలకు సమాధానం చెప్పలేకపోతున్నామని తలపట్టుకుంటున్నారు. వయల్స్ లేక సెంటర్లలో నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. మంగళవారం మెజార్టీ వ్యాక్సిన్ సెంటర్లలో నో స్టాక్‌ బోర్డులు కనిపించాయి. మరోవైపు థర్డ్ వేవ్ భయంతో పెద్ద సంఖ్యలో జనాలు వ్యాక్సిన్ తీసుకునేందుకు వస్తున్నారు. సెకండ్​ డోస్ టైమ్‌ అయినవాళ్లు తమకు వ్యాక్సిన్ ​వేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. కొన్ని చోట్ల రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. సెంటర్లపై దాడులకు దిగుతున్నారు. 
సెంటర్లకు పెరిగిన తాకిడి
18 ఏళ్లు నిండిన వాళ్లందరికీ వ్యాక్సిన్​ వేస్తామని ప్రభుత్వం ప్రకటించడం, థర్డ్ వేవ్​భయంతో వ్యాక్సిన్‌‌ సెంటర్లకు జనాల తాకిడి పెరిగింది. కానీ సెకండ్ డోస్ వాళ్లకే దొరకని పరిస్థితి కనిపిస్తోంది. వ్యాక్సిన్ వేసుకునే గడువు ముగిసి 15 రోజులు దాటినా టీకా వేసే పరిస్థితి ఉండట్లేదు. సెంటర్లకు పంపుతున్న డోసులకూ, వస్తున్న పబ్లిక్​కు పొంతన కుదరట్లేదు. యూహెచ్‌‌సీ, పీహెచ్‌‌సీల్లో రోజుకు 100 నుంచి 120 డోసులు, జిల్లా కేంద్రంలోని ఆస్పత్రుల్లో రోజుకు 300 డోసుల దాక ఇస్తుండగా అంతకు రెండు, మూడు రెట్ల పబ్లిక్​ఉదయం నుంచే క్యూ కడుతున్నారు. సెంటర్ల వద్దే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించడంతో టోకెన్ల కోసం ఎగబడుతున్నారు. డోసులు ఉన్నంత వరకే టోకెన్లు ఇస్తే మిగిలిన వాళ్లు ఆందోళనకు దిగుతున్నారు. రెండో డోసు టైం అయినవాళ్లను సముదాయించడం హెల్త్​స్టాఫ్ వల్ల కావట్లేదు. దీంతో పలు సెంటర్ల వద్ద పోలీసులను మోహరించాల్సి వస్తోంది.
సెకండ్ డోస్ వాళ్లకు మెసేజ్‌‌లతో సమస్య 
రాష్ట్రంలోని 958 ప్రభుత్వ, 77 ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కోటీ 9 లక్షల 55 వేల 605 మంది టీకా తీసుకున్నారు. వీళ్లలో 84 లక్షల 10 వేల 287 మంది సింగిల్ ​డోస్.. 25 లక్షల 45 వేల 318 మంది డబుల్ డోస్ తీసుకున్నారు. మొదట్లో అన్నిచోట్లా స్లాట్ బుకింగ్‌‌కు అవకాశం కల్పించారు. సప్లై సరిగా లేక స్లాట్ బుకింగ్ సిస్టమ్‌‌ను క్యాన్సిల్ చేశారు. అప్పటి నుంచి సెంటర్ల వద్ద రిజిస్ట్రేషన్ విధానం అమలు చేస్తున్నారు. కానీ సెకండ్ ​డోస్ ​టైమ్‌‌ అయినవాళ్ల సెల్​ఫోన్లకు మెసేజ్ వస్తుండటంతో వాళ్లంతా సెంటర్లకు వస్తున్నారు. అప్పటికే టోకెన్లు, డోసులు అయిపోవడంతో వాళ్లు గొడవకు దిగుతున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌కు మంగళవారం ఫస్ట్, సెకండ్ డోస్ వాళ్లు కలిపి 700 మంది రాగా 70 డోసులే అందుబాటులో ఉండటంతో మిగిలిన వాళ్లను వెనక్కి పంపేశారు.  
ధర్నాలు.. దాడులు 
వ్యాక్సిన్ నిల్వలు అయిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సెంటర్లలో మంగళవారం నో స్టాక్‌‌ బోర్డులు కనిపించాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో శనివారం నుంచే చాలా ఆస్పత్రులు, పీహెచ్‌‌సీలు, యూపీహెచ్‌‌సీల్లో వ్యాక్సినేషన్ బంద్ పెట్టారు. మంగళవారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌‌ హాస్పిటల్‌‌ వ్యాక్సినేషన్ సెంటర్‌‌లో వ్యాక్సిన్లు అయిపోవడంతో జనాలు ధర్నా చేశారు. ఈ జిల్లాలో 27 సెంటర్లలో వ్యాక్సినేషన్‌‌ నిలిపేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్‌‌నగర్ కాలనీ అర్బన్ పీహెచ్‌‌సీ సెంటర్‌‌పై పబ్లిక్ దాడి చేశారు. సెంటర్‌‌ అద్దాలు పగులగొట్టారు. వరంగల్ అర్బన్ జిల్లాలో వ్యాక్సినేషన్ ఆగింది. జనగామ జిల్లాలో ఒక్క పాలకుర్తి పీహెచ్‌‌సీలోనే మంగళవారం టీకాలేశారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వారంలో రోజు తప్పించి రోజు వ్యాక్సిన్ వేస్తున్నారు. జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వ్యాక్సినేషన్ పూర్తిగా ఆగింది. ఖమ్మం జిల్లాకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ సప్లై ఆగింది. కొవాగ్జిన్ మాత్రమే వేస్తున్నారు. అది కూడా రెండో డోసు వాళ్లకే ఇస్తుండటంతో ఫస్ట్ డోస్ వాళ్లు ఆందోళన చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పీహెచ్‌‌సీల్లో వారానికి రెండు లేదా మూడు రోజులే వేస్తున్నారు. ఏరియా హాస్పిటల్‌‌లో ఇప్పటికి 3 రోజులకు పైగా వ్యాక్సిన్ వేయలేదు. సిద్దిపేట జిల్లాలో సెకండ్ డోస్ కోసం ప్రజలు వేచి చూడాల్సిన పరిస్థితి. కొవిషీల్డ్ సరిపడా సప్లై కాక పరిమిత సంఖ్యలో టోకెన్లు ఇచ్చి పబ్లిక్‌‌ను కంట్రోల్ చేస్తున్నారు. మంగళవారం కొన్ని సెంటర్లలోనే టీకాలేశారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలో వ్యాక్సినేషన్ పూర్తిగా బంద్ చేశారు. నాగర్‌‌కర్నూల్ జిల్లాలో ఏరియా హాస్పిటల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ కమ్యూనిటీ హాస్పిటళ్లలోనే వ్యాక్సిన్ ఇచ్చారు. ఇక్కడ జనం ఎగబడటంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

సిటీలోనూ నో స్టాక్​
సిటీలోనూ వ్యాక్సినేషన్ సెంటర్లలో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. రోజుకు వెయ్యి మందికి వ్యాక్సిన్ వేస్తామని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీకా సెంటర్లూ మూతబడ్డాయి. కొన్ని సెంటర్లలోనే వ్యాక్సిన్ ఉంటోంది. మంగళవారం సిటీలో 25 సెంటర్లలో 2,800 మందికి వ్యాక్సిన్ వేశారు. అది కూడా సెకండ్ డోసు కొవాగ్జిన్ టీకా మాత్రమే అందించారు. కొవిషీల్ట్ స్టాక్ లేదు. ఇంకో మూడ్రోజులు పరిస్థితి ఇలాగే ఉండొచ్చని హెల్త్ ఆఫీసర్లు చెప్పారు. మంగళవారం 68 ప్రైవేట్ సెంటర్లలో 6,500 మంది టీకా వేసుకున్నారు.

67% మందిలో యాంటీబాడీలు
దేశంలో ఆరేండ్లపైన ఉన్నోళ్లలో 67.6 శాతం మందికి కరోనా యాంటీ బాడీలున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మరో 40 కోట్ల మందికి మహమ్మారి ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. మంగళవారం నాలుగో సీరో సర్వే ఫలితాలను  ఐసీఎంఆర్  వెల్లడించింది.