V6 News

గ్లోబల్ సమిట్తో తెలంగాణ స్టేచర్ లోకల్ టు గ్లోబల్

గ్లోబల్ సమిట్తో తెలంగాణ స్టేచర్ లోకల్ టు గ్లోబల్

అకుంఠిత దీక్ష, అత్యున్నతమైన సంకల్పం ఏం చేయగలదో  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపించారు. కేవలం రెండేండ్ల పాలనా కాలంలోనే బలమైన దార్శనిక  పునాదుల్ని నిర్మిస్తూ తెలంగాణకు నవోదయం తీసుకొచ్చారు. రాష్ట్రంలో పేదరికం, వివక్ష ఉండకూడదనే సంకల్పాన్ని తీసుకొన్నాడు. రెండు రోజులపాటు ప్రపంచంలోని అతిరథ మహారథుల్ని తెలంగాణకు తీసుకొచ్చి, ప్యూచర్ సిటీ నిర్మాణంతోపాటు రాష్ట్ర పున:నిర్మాణంలో భాగస్వాముల్ని చేసారు. 

ప్యూచర్ సిటీలో జరిగిన ఈ గ్లోబల్ సమిట్ కేవలం తెలంగాణకే కాదు, యావత్ భారతదేశానికి గ్రోత్ ఇంజిన్గా మారబోతుంది. రెండు రోజులు జరిగిన ఈ గ్లోబల్ సమిట్​లో  వచ్చిన రూ.5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులే తెలంగాణ ఉజ్వల భవితను సూచిస్తున్నాయి. తద్వారా మన తెలంగాణ యువత అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలను ఈ గడ్డపైనే పొందే పరిస్థితులు రానున్నాయని సమిట్​ చెపుతోంది.

క్యూ ర్, ప్యూర్, రేర్ రీజియన్లుగా తెలంగాణ ప్రగతిని విభజించి ఏ రంగానికి, ఎక్కడ అవకాశాలు ఉన్నాయో వివరించడమే కాకుండా, ప్రభుత్వపరంగా ఏ విధమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామో చెప్పి ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్​ను ఆవిష్కరించింది ప్రజా ప్రభుత్వం.   దేశానికే  గ్రోత్ ఇంజిన్​గా  మారి 3 ట్రిలియన్  డాలర్ల  ఎకానమీగా  తెలంగాణను  మార్చడానికి  వేసుకున్న  రూట్ మ్యాప్​ను స్పష్టంగా వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. 

డిసెంబర్ 8, 9 తేదీల్లో గ్లోబల్ సమిట్ లో  తెలంగాణ ప్రభుత్వం గత రెండేడ్లలో సాధించిన ప్రగతి,  లక్ష్యాల్ని స్పష్టంగా ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులైన మంత్రులు, అధికారులు వివరించి చెప్పడాన్ని వచ్చిన ప్రఖ్యాత ప్రతినిధులు ఆసక్తిగా విన్నారు. దేశంలోని 28  రాష్ట్రాలు సమిట్​ను  నిశితంగా పరిశీలించాయి. ఇలాంటి గ్లోబల్ సమిట్ మా రాష్ట్రంలోనూ జరిగితే  బాగుండు అని అవి అనుకొని ఉంటాయి.

అద్వితీయ ప్రదర్శన
మొదటిరోజు పవరింగ్ తెలంగాణ ప్యూచర్ ఆవిష్కరణ మొదలు.. 3 ట్రిలియన్ ఎకానమీ రూట్ మ్యాప్, గ్రీన్ మొబిలిటి, ఏఐ, సెమికండక్టర్ల వంటి టెక్ తెలంగాణ అంశాల నుంచి మొదలుకుంటే.. 
ప్రాస్పెరిటీ ఫర్ ఎవ్రివన్, ఫైనాన్షియల్ హబ్,  స్టార్టప్స్,  ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్​తో   స్పోర్ట్స్ ఎరీనా..  వంటి 27 అంశాలపై అంతర్జాతీయ ప్రతినిధుల ప్రజెంటేషన్లతోపాటు.. తెలంగాణతో ఏకంగా సౌత్ కొరియా, అస్ట్రేలియా, కెనడా వంటి దేశాల భాగస్వామ్యం ఉండేలా గ్లోబల్ సమిట్ ఒక ప్రణాళికాబద్ధంగా, దిగ్విజయంగా జరిగింది.

సమిట్ను హైలైట్​ చేసిన ట్రంప్​ మీడియా
అమెరికా అధ్యక్షుడి సొంత కంపెనీ ట్రంప్ మీడియా సీఈవో ప్రత్యక్షంగా సమిట్​లో  పాల్గొనడమే కాకుండా దశలవారీగా లక్ష కోట్ల పెట్టుబడి ప్రణాళికల్ని వివరించారు.  రూ.41వేల కోట్లతో లక్షలాది మంది  తెలంగాణ యువత భవితకు భరోసా ఇవ్వడం సమిట్​ను హైలైట్​ చేసింది.  ఇదేకాక డీప్ టెక్ రంగంలో బ్రూక్ ఫీల్డ్ యాక్సిస్ రూ.75వేల కోట్లు, ఎవ్రెన్ రూ.31వేల కోట్లు, విన్ గ్రూప్ రూ.27వేల కోట్లు,  సినీదిగ్గజం సల్మాన్ ఖాన్ రూ.10వేల కోట్లు,  అజయ్ దేవ్ గన్ స్టూడియో,  మెఘా రూ.8వేల కోట్లే కాకుండా ఎన్నో కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నాయి.

సమిట్​ రెండో రోజు..
రెండోరోజు ఇన్​ప్రాకీ ఏఐ రెడీ డేటా పార్క్ రూ.75000 కోట్లు,  గోద్రేజ్  రూ.150 కోట్లు, పెర్టిస్ ఇండియా రూ.2000 కోట్లు, పెర్టిస్ ఇండియా రూ.2000 కోట్లతో రేర్ షుగర్ ప్యాక్టరీ, రూ.650 కోట్లతో ఖాజన్ బెవరేజెస్, ఎఫ్డీసీ రూ.1100 కోట్ల్లు, రిలయన్స్ రూ.1500 కోట్లు, క్రేన్ టెక్నాలజీ 1000 కోట్లు, ఆర్సిసిటీ ఎనర్జీ రూ.2500 కోట్లు, అరబిందో ఫార్మా రూ.2000 కోట్లు, గ్రాన్యూల్ ఇండియా రూ. 1200 కోట్లు, బయాలాజికల్ ఇండియా రూ.4000 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకొని 2026 నుంచే కార్యకలాపాల్ని ప్రారంభించి 2047 కల్లా 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ ఎదగడంలో తమదైన పాత్రను పోషించబోతున్నాయి.

ప్రపంచానికి ఆదర్శవంతం
దిగ్గజ కంపెనీల పెట్టుబడుల ద్వారా లక్షలాది మంది తెలంగాణ యువతకు సొంతరాష్ట్రంలోనే  గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది.  తద్వారా  తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ ప్రపంచానికే ఆదర్శవంతంగా మారబోతుంది. ఇదీ దార్శనిక నాయకత్వం చేయాల్సిన పని. దావోస్ సమిట్​ను మించి ఒక రాష్ట్రంగా తెలంగాణ గ్లోబల్ సమిట్ ద్వారా సాధించిన విజయం ఇది. 

ఇక్కడికి వచ్చిన అతిరథ, మహారథులకు తెలంగాణ అంటే ఏంటో చెప్పడమే కాదు, తెలంగాణ ఆతిథ్యం ఎంత మర్యాదకరంగా ఉంటుందో,  ఎంతగొప్ప అనుభూతిని అందిస్తుందో తెలియజేసింది  ప్రజా ప్రభుత్వం. మనవైన తెలంగాణ  పిండివంటల్ని ప్రేమగా వడ్డించడమే కాకుండా మనవైన గుస్సాడి, పేరిణి వంటి కళారూపాలతో సేదతీర్చింది. 

యావత్  దేశానికి దిక్సూచి
తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమిట్  తెలంగాణ పటాన్ని ప్రపంచం గుండెల్లో శాశ్వతంగా ముద్రించింది. రాబోయే రోజుల్లో  తెలంగాణలో పేదరికం, వివక్షతలు లేని సమాజాన్ని కలగంటూ, స్పష్టమైన కార్యాచరణతో కూడిన లక్ష్యాల్ని నిర్దేశించుకుంటూ ఆవిష్కరించిన ఈ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ మన కలల్ని నిజం చేస్తుందని ఆశిద్దాం.

నిన్న స్వప్నంగా మెరిసి నేడు ఆచరణతో అనుభవంలోకి రాబోతుంటే.. ఈ రోజు కోసమే కదా నాడు తెలంగాణ బిడ్డలు త్యాగాలు చేసి స్వరాష్ట్రం కోసం పోరాడింది! ఈ తరుణం కోసమే కదా.. పార్టీని సైతం  పణంగా పెట్టి తల్లి  సోనియాగాంధీ  తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది అనిపిస్తుంది. లక్షలాదిగా వచ్చే ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో ప్రపంచ పౌరుడితో పోటీపడి తెలంగాణ బిడ్డలు రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాల్లో నిలబెడతారని ఆశిద్దాం!

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, సీఈవో, టిసాట్ నెట్​వర్క్​