స్థానికత శాపం.. మెడికల్ సీటుకు దూరం!..ఏపీలో ఇంటర్ చదివిన 26 మంది తెలంగాణ స్టూడెంట్స్‌‌కు తీరని నష్టం

స్థానికత శాపం.. మెడికల్ సీటుకు దూరం!..ఏపీలో ఇంటర్ చదివిన 26 మంది తెలంగాణ స్టూడెంట్స్‌‌కు తీరని నష్టం
  • జీవో 33 ప్రకారం 9 నుంచి ఇంటర్ వరకు తెలంగాణలో చదివితేనే లోకల్
  • అటు ఏపీకి, ఇటు తెలంగాణకు చెందకుండా భవిష్యత్ ప్రశ్నార్థకం
  •  జీవో 144 పరిధిలోకి వస్తామంటున్న విద్యార్థులు

హైదరాబాద్, వెలుగు: ఏపీలో ఇంటర్‌‌‌‌ చదివిన స్టూడెంట్స్‌‌కు స్థానికత నిబంధన శాపంగా మారింది. నీట్‌‌లో అర్హత సాధించినా మెడికల్​ సీటుకు దూరమవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో  26 మంది విద్యార్థులు ప్రభుత్వానికి లేఖ రాసి.. తమ గోడు వెళ్లబోసుకున్నారు. ‘‘పుట్టింది ఇక్కడే.. పెరిగిందీ ఇక్కడే.. పదో తరగతి వరకు చదివింది కూడా  ఇక్కడి ప్రభుత్వ బడుల్లోనే. కానీ, వివిధ కారణాలతో ఏపీలో ఇంటర్ రెండేండ్లు చదివిన పాపానికి ఇప్పుడు మమ్మల్ని తెలంగాణేతరులుగా పరిగణిస్తున్నారు. 

కొత్తగా తెచ్చిన జీవో 33 మా పాలిట శాపంగా మారింది. అటు ఏపీకీ, ఇటు తెలంగాణకు కాకుండా మా భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. దయచేసి మమ్మల్ని ఆదుకోండి’’ అంటూ  అభ్యర్థించారు. 2024 జులై 19న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెం. 33 కారణంగా తాము స్థానికతను కోల్పోయి నష్టపోతున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ స్పందించి  తమను జీవో నెంబర్ 33 నుంచి మినహాయించాలని కోరుతున్నారు. సోమవారమే మూడో రౌండ్ కౌన్సెలింగ్‌‌కు చివరి తేదీ కావడంతో.. ప్రభుత్వం తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని వేడుకుంటున్నారు.

జీవో 33 వర్తించదు 

ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న విద్యార్థులు జీవో నెంబర్ 33ని తీసుకురాక ముందే ఏపీలో ఇంటర్ పూర్తి చేశారు. దీంతో తాము జీవో నెంబర్ 114 పరిధిలోకి వస్తామని చెబుతున్నారు.  నీట్‌‌లో మెరుగైన ర్యాంకు కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నామని, ఈ ఏడాది నీట్‌‌లో 500 నుంచి 5 వేల మధ్య ర్యాంకులు సాధించామని పేర్కొంటున్నారు. 

ఇప్పటికే కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన రెండు కౌన్సెలింగ్‌‌లలో తమ కంటే తక్కువ ర్యాంకు సాధించిన విద్యార్థులకు మెడికల్ సీట్లు లభించాయని చెబుతున్నారు.హైకోర్టు, సుప్రీంకోర్టు తలుపులు తట్టామని, కోర్టులు సైతం రాష్ట్ర ప్రభుత్వం వద్దే తేల్చుకోవాలని సూచించాయని అంటున్నారు. మెడికల్ విద్య తమ కల అని, ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే?

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి పదేండ్ల పాటు వైద్య విద్య ప్రవేశాల్లో పాత విధానమే అమల్లో ఉంది. జీవో నెం. 114 ప్రకారం వరుసగా 7 విద్యా సంవత్సరాల్లో నాలుగేండ్లు తెలంగాణలో చదివితే లోకల్‌‌గా పరిగణించేవారు. దీంతో చాలా మంది విద్యార్థులు.. వివిధ కారణాలతో, ముఖ్యంగా సరిహద్దు జిల్లాలవారు.. మెరుగైన నీట్ కోచింగ్ కోసం ఏపీలోని కాలేజీల్లో ఇంటర్మీడియెట్ పూర్తిచేశారు. 

అయితే, రాష్ట్రంలోని మెడికల్ సీట్లలో 85 శాతం స్థానికులకే చెందాలని ప్రభుత్వం  జీవో నెం. 33ను తెరపైకి తెచ్చింది. ఈ కొత్త జీవో ప్రకారం 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు వరుసగా 4 ఏండ్లు తెలంగాణలోనే చదివితేనే స్థానిక హోదా లభిస్తుంది. ఈ జీవో 33 వల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సీట్లు పొందకుండా మన రాష్ట్ర పిల్లలకే స్టేట్ కోటా సీట్లు దక్కుతున్నప్ప టికీ, ఏపీలో ఇంటర్ చదివిన మన విద్యార్థులకు ఇప్పుడు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.