పెరిగిన రాబడి.. అంతలోనే మాయం!..4 నెలల్లో వచ్చిన ట్యాక్స్ ఇన్కమ్రూ.53,004 కోట్లు 

పెరిగిన రాబడి.. అంతలోనే మాయం!..4 నెలల్లో వచ్చిన ట్యాక్స్ ఇన్కమ్రూ.53,004 కోట్లు 
  • వడ్డీలు, పెన్షన్లకు 21,024 కోట్లు.. శాలరీలకు ఇంకో 17 వేల కోట్లు 
  • క్యాపిటల్ ఖర్చుకు నిధుల లేమి.. ఇప్పటి వరకు ఖర్చుచేసిందిరూ. 9,272 కోట్లే 
  • జులై నివేదికను వెల్లడించిన కాగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పన్ను ఆదాయం పెరిగినా సర్కార్ ఆర్థిక పరిస్థితి మారడం లేదు. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో పన్నుల ద్వారా రూ.53 వేల కోట్లు రాబట్టినా, వచ్చిన పైసలన్నీ పెన్షన్లు, పాత అప్పుల వడ్డీలకే కరిగిపోయాయి. జులై నాటికి ఈ రెండింటికే ఏకంగా రూ. 21,024 కోట్లు ఖర్చయ్యాయని కాగ్ జులై నివేదిక తేల్చింది. గత ఏడాదితో పోలిస్తే పన్ను ఆదాయంలో దాదాపు 3 శాతం వృద్ధి నమోదైనప్పటికీ, అభివృద్ధి పనులకు మాత్రం రూపాయి దక్కడం లేదు.

బడ్జెట్లో రూ. 47,267.28 కోట్ల మూలధన వ్యయం లక్ష్యంగా పెట్టుకుంటే, ఇప్పటివరకు ఖర్చు చేసింది కేవలం రూ. 9,272 కోట్లే. అంటే నాలుగు నెలల్లో కేవలం 19.62 శాతం నిధులు మాత్రమే మౌలిక వసతుల కల్పనకు ఉపయోగించారు. పెరుగుతున్న ఆదాయం అంతా రోజువారీ పరిపాలనా ఖర్చులు, పాత బాకీలకే సరిపోతుండటంతో రాష్ట్ర ఆర్థిక చక్రం ముందుకు సాగడం లేదు.

సింహభాగం పరిపాలన, వడ్డీలు, సబ్సిడీలకే..

ఖర్చుల రికార్డులను పరిశీలిస్తే.. ప్రభుత్వం సేకరించిన నిధుల్లో సింహభాగం పరిపాలన, వడ్డీలు, సబ్సిడీలకే సరిపోతోంది. జులై నాటికి మొత్తం రూ. 88,182  కోట్లు ఖర్చు చేయగా, అందులో దాదాపు 89 శాతం నిధులు అంటే.. రూ.78,909.45 కోట్లు కేవలం రెవెన్యూ వ్యయానికే పరిమితమయ్యాయి. ఇందులోనూ అప్పులపై కట్టాల్సిన వడ్డీలకే రూ.10,532 కోట్లు (బడ్జెట్ అం చనాలో 49.44%) కాగా, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ల కోసం రూ. 10,492.35 కోట్లు 71.20% వెచ్చించారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు రూ. 17,874 కోట్లు, వివిధ రకాల సబ్సిడీల కింద రూ. 7,870 కోట్లు  ఖర్చయ్యాయి. సర్కారు ఆదాయంలో అత్యధిక భాగం ఈ అనివార్యమైన ఖర్చులకే పోతుండడంతో సంక్షేమం, అభివృద్ధి సమతుల్యత దెబ్బతింటోంది.

ద్రవ్యలోటు తీవ్రరూపం

ఆదాయం, వ్యయాల మధ్య అంతరం రోజురోజుకూ పెరిగిపోతుండడంతో ద్రవ్యలోటు తీవ్రరూపం దాల్చుతోంది. జులై చివరి నాటికి రెవెన్యూ లోటు రూ.-19,266 కోట్లుగా ఉండగా, ఫిస్కల్ డెఫిసిట్ (ద్రవ్యలోటు) ఏకంగా రూ. -33,729 కోట్లకు ఎగబాకింది. ఏడాది మొత్తానికి అంచనా వేసిన ద్రవ్యలోటు బడ్జెట్ లక్ష్యంలో 57.70 శాతాన్ని ఈ నాలుగు నెలల్లోనే దాటేయడం గమనార్హం. ఆదాయం పెరుగుతున్నా పెరిగిన అప్పులు, వడ్డీల భారం వల్ల రాష్ట్రం ఇంకా ఆర్థిక తిప్పలు ఎదుర్కొంటూనే ఉందని కాగ్ నివేదిక స్పష్టం చేస్తోంది.

పెరిగిన పన్ను వసూళ్లు

వ్యాపార లావాదేవీలు పుంజుకోవడంతో పన్ను వసూళ్లు పెరిగాయి. జులై నాటికి వచ్చిన రూ. 53 వేల కోట్ల పన్ను రాబడి బడ్జెట్ అంచనాల్లో 29.22 శాతానికి సమానం. గతేడాది ఇదే సమయానికి నమోదైన 27.46 శాతంతో పోలిస్తే మెరుగు పడింది. ఇందులో జీఎస్టీ ద్వారా రూ.19,103 కోట్లు (31.03%), సేల్స్ టాక్స్ నుంచి రూ. 12,584 కోట్లు (33.03%) వచ్చాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా రూ. 6,144 కోట్లు రాగా, గతంలో ఉన్న 26.55 శాతం నుంచి ఈసారి రాబడి 31.45 శాతానికి చేరింది. ఎక్సైజ్ శాఖ ద్వారా రూ. 6,965 కోట్లు ఖజానాకు వచ్చాయి. నాన్-ట్యాక్స్ రెవెన్యూ విభాగంలో గతేడాది కేవలం 4.22 శాతమే రాగా, ఈసారి ఏకంగా 11.96 శాతానికి పెరిగి రూ. 4,274 కోట్లు సమకూరడం విశేషం.