- మావోయిస్టు చీఫ్ స్థానానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రెండో వ్యక్తి
- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా హిడ్మా
- ఏపీలో ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు కమలేశ్ ద్వారా వివరాలు వెలుగులోకి..
కరీంనగర్/ భద్రాచలం, వెలుగు: సీపీఐ(మావోయిస్టు) పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి (70) అలియాస్ దేవ్ జీ అలియాస్ సంజీవ్, రమేశ్ అలియాస్ చేతన్ అలియాస్ కుమ్మ దేవన్న అలియాస్ సుదర్శన్ ఎన్నికైనట్లు తెలిసింది. గతంలో కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఈ ఏడాది మే 21న అబూజ్ మడ్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో నేలకొరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం ఇంద్రావతి ఏరియాలో సమావేశమైన మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ తిరుపతిని పార్టీ కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎంసీ) చీఫ్ గా పనిచేస్తున్న ఆయన ఇక మావోయిస్టు పార్టీ సారథిగా వ్యవహరించనున్నారు. జులై 24న ఏపీ పోలీసులకు లొంగిపోయిన జోరిగె నాగరాజు అలియాస్ కమలేశ్, ఆయన భార్య మేడక జ్యోతీశ్వరి అలియాస్ అరుణను ఎస్ఐబీ పోలీసులు విచారించగా ఈ వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. కమలేశ్ లొంగిపోయే ముందు వరకు తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీకి ఇన్‌చార్జ్‌గా పనిచేస్తూ, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడి హోదాలో ఉన్నాడు. 2024 అక్టోబర్ రాయ్ పూర్–దంతెవాడ సరిహద్దు లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 38 మంది మావోయిస్టులు మరణించగా.. ఆ ఎన్ కౌంటర్ నుంచి కమలేశ్ తప్పించుకున్నాడు.
42 ఏండ్లుగా అజ్ఞాతంలోనే..
జగిత్యాల జిల్లా కోరుట్లలోని అంబేద్కర్ నగర్ కు చెందిన తిప్పిరి వెంకట నరసయ్య, గంగుబాయి దంపతులకు జన్మించిన తిరుపతికి ఇద్దరు తమ్ముళ్లు, ఒక అక్క ఉన్నారు.1984 లో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫస్టియర్ చదువుకునే క్రమంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్(ఆర్ఎస్ యూ)లో చేరాడు. ఏబీవీపీ, ఆర్ఎస్ యూ విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణల్లో కేసులు నమోదు కావడం, పోలీసుల వేధింపులు తీవ్రం కావడంతో తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్లాడు. దళ సభ్యుడిగా.. కమాండర్ గా పనిచేసి అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ గా, మిలటరీ కమిషన్ చీఫ్ గా, దాడుల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు.
కొయ్యూరు అమరులు నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేశ్ జ్ఞాపకార్థం తొలిసారిగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్ జీఏ) సాయుధ ప్లాటూన్‌ను ఏర్పాటు చేసిన ఘనత తిరుపతికి ఉంది. పదుల సంఖ్యలో ఎన్ కౌంటర్ల నుంచి ఆయన చాకచాక్యంగా తప్పించుకున్నారనే పేరుంది. చంద్రబాబుపై జరిగిన దాడి ఘటనలో సంబాల కేశవరావుతో పాటు తిప్పిరి తిరుపతి పాత్ర ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. దంతెవాడ సమీపంలో సెంట్రల్ రిజర్వ్ జవాన్లపై దాడి జరిపి 74 మందిని హతమార్చిన ఘటనకు తిరుపతి సారథ్యం వహించినట్లు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. తిరుపతి తలపై రూ.కోటిన్నర రివార్డు ఉంది.
మావోయిస్టు కేంద్ర కమిటీ సెక్రటరీగా మరో తెలుగు నేత..
సీపీఐ(ఎంఎల్) పార్టీకి మొదటి కేంద్ర కమిటీ కార్యదర్శిగా నక్సల్బరీ ఉద్యమ నిర్మాత చారుమజుందార్ వ్యవహరించారు. ఆ తర్వాత ఆ పార్టీ పేరు సీపీఐ(పీపుల్స్ వార్) గా మారాక కృష్ణా జిల్లాకు చెందిన కొండపల్లి సీతారామయ్య కేంద్ర కమిటీ కార్యదర్శిగా 1992 వరకు పనిచేశారు. 1980లో కొంత కాలం కేజీ సత్యమూర్తి అలియాస్ శివసాగర్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. 1992లో కొండపల్లి సీతారామయ్య స్థానంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీర్ పూర్(ప్రస్తుత జగిత్యాల జిల్లా) ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్ గణపతి ఎన్నికై 2018 వరకు కొనసాగారు.
ఈయన హయాంలోనే పీపుల్స్ వార్ - మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్(ఎంసీసీ) విలీనమై 2004 మావోయిస్టు పార్టీగా అవతరించింది. 2018లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన అప్పటి సెంట్రల్ మిలటరీ కమిషన్ చీఫ్ నంబాల కేశవరావు అలియాస్ గంగన్న, బస్వరాజు కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మావోయిస్టు పార్టీలో సెంట్రల్ మిలటరీ కమిషన్ చీఫ్ పదవి.. రెండో అత్యున్నత పదవి. అందుకే నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ లో చనిపోవడంతో.. ఆయన తర్వాతి స్థానంలో ఉన్న తిప్పిరి తిరుపతిని మావోయిస్టు చీఫ్ గా కేంద్ర కమిటీ ఎన్నుకున్నట్లు తెలిసింది.
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా హిడ్మా
మావోయిస్టు కేంద్ర కమిటీ తర్వాత అత్యంత కీలకమైన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ(డీకేజెడ్ సీ) బాధ్యతలను మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు లీడర్, ఆదివాసీ గెరిల్లా నేత మడవి హిడ్మాను అప్పగించినట్లు కమలేశ్ ద్వారా నిఘా వర్గాలకు తెలిసింది. అంతకుముందు వరకు ఆ బాధ్యతలను కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ శ్రీనివాస్ నిర్వహించేవారు. అనారోగ్యం కారణంగా ఆయన యాక్టివ్ గా లేరని అందుకే హిడ్మాను నియమించినట్లు సమాచారం.
