డిజిటల్ క్రాప్ సర్వే చేపట్టండి : సీఎస్ రామకృష్ణారావు

డిజిటల్ క్రాప్ సర్వే చేపట్టండి : సీఎస్ రామకృష్ణారావు
  •     కోహెడ మార్కెట్ పనులు స్పీడప్ చేయండి
  •     అధికారులకు సీఎస్ రామకృష్ణారావు దిశానిర్దేశం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను సాధించే దిశగా పనులు స్పీడప్ చేయాలని అధికారులకు సీఎస్ రామకృష్ణారావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన వ్యవసాయ, పశుసంవర్ధక, అటవీ, పౌర సరఫరాలు, కార్మిక శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ లక్ష్యాల అమలులో అలసత్వం వద్దని అధికారులను హెచ్చరించిన సీఎస్.. రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. 

యూరియా, ఎరువుల పంపిణీలో లోపాలు రాకుండా ఐటీ ఆధారిత వ్యవస్థలను బలోపేతం చేయాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాలోని కోహెడ మార్కెట్‌‌ను హైబ్రిడ్ మోడల్‌‌లో అభివృద్ధి చేస్తున్నందున దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పంటల దిగుబడి, రైతు సమస్యలపై నిరంతర పర్యవేక్షణ, రాష్ట్రవ్యాప్త 'డిజిటల్ క్రాప్ సర్వే' నిర్వహణ చేపట్టాలని సూచించారు.

ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు

రాబోయే సీజన్‌‌కు విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, సహకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని అధికారులకు సీఎస్ చెప్పారు. పశువైద్య సేవలు గ్రామస్థాయిలో బలపరచాలని, పశువుల వ్యాధుల నివారణకు ముందస్తు టీకాలు వేయాలన్నారు. డెయిరీ రంగంలో పాల సేకరణ, శీతలీకరణ కేంద్రాల సామర్థ్యం పెంచాలని ఆదేశించారు.

మల్లన్న సాగర్, కొండపోచమ్మ వంటి జలాశయాల్లో చేపల పెంపకానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. అలాగే, అటవీ శాఖలో ఎకో టూరిజం, అర్బన్ పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎస్ స్పష్టం చేశారు. కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. 

ప్రజా పంపిణీ వ్యవస్థలో సన్న బియ్యం, గోదాము నిల్వలు, రేషన్ షాపుల్లో ఈ-పాస్ యంత్రాల వినియోగంపై సమీక్షించారు. నర్సింగ్ విద్యార్థులకు విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, నైపుణ్య శిక్షణలను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మెరుగుపరచాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు దాన కిషోర్, బీఎండీ ఎక్కా, ముఖ్య కార్యదర్శులు అహ్మద్ నదీమ్, ఇలంబర్తీ తదితరులు పాల్గొన్నారు.