- ఎల్బీ స్టేడియం వేదికగా ‘లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్–2026’కు ఏర్పాట్లు
- మంత్రి జూపల్లి చైర్మన్ గా, వాకిటి శ్రీహరి కో చైర్మన్‌గా కమిటీ
హైదరాబాద్, వెలుగు: నిత్యం రాజకీయ కార్యకలాపాలు, ప్రజా సమస్యలతో బిజీగా ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 28, 29 తేదీల్లో ‘మొదటి ఎడిషన్ లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్–2026’ పేరుతో ప్రజా ప్రతినిధులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇలాంటి పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ క్రీడోత్సవం కోసం ప్రభుత్వం గురువారం ఒక ప్రత్యేక కమిటీని ప్రకటించింది.
ఈ కమిటీకి చైర్మన్ గా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును, కో-చైర్మన్ గా క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని, కన్వీనర్ గా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను, మరో 13 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సభ్యులుగా నియమించారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమావేశమైన కమిటీ.. పోటీల నిర్వహణపై సమీక్ష నిర్వహించింది.ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు ఎల్బీ స్టేడియంలో క్రీడలు ప్రారంభమవుతాయి. ఆటల పోటీలు ఎల్బీ స్టేడియంలో, సాంస్కృతిక కార్యక్రమాలు రవీంద్రభారతిలో జరగనున్నాయి.
ప్రజల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకే..
ప్రజాప్రతినిధుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడం, ప్రజల్లో క్రీడా స్ఫూర్తిని నింపడం కోసమే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటలపోటీలు పెడుతున్నామని స్పోర్ట్స్ కమిటీ చైర్మన్, మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. అంతకుముందు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి కలిసి స్పోర్ట్స్ కిట్ ను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ..ఈ నెల 28, 29 తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ‘మొదటి ఎడిషన్ లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్–2026’ పేరుతో ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రవీంద్రభారతీలో ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
