
- ఐదేండ్ల కార్యాచరణ ప్రణాళిక
- 2030 నాటికి 6వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లు
- విద్యుత్ రివ్యూ మీటింగ్‌లో ఎనర్జీ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, రాబోయే ఐదేండ్లలో నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. శనివారం విద్యుత్ సౌధలో జరిగిన సమీక్షా సమావేశంలో సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫారూఖీతో కలిసి కార్యాచరణ ప్రణాళికను పరిశీలించారు. ఈ సందర్భంగా సుల్తానియా మాట్లాడుతూ 2025 ఫైనాన్సియల్ ఇయర్లో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 16,877 మెగావాట్లుగా ఉంటుందని కేంద్ర విద్యుత్ అథారిటీ (సీఈఏ) అంచనా వేసిందనీ, కానీ వాస్తవంగా 17,162 మెగావాట్ల డిమాండ్‌తో ఈ అంచనాలను అధిగమించిందని తెలిపారు.
2026 ఫైనాన్షియల్ ఇయర్లో పీక్ డిమాండ్ 18,138 మెగావాట్లుగా ఉండవచ్చని సీఈఏ అంచనా వేసిందనీ అన్ని రంగాల్లో పెరుగుతున్న డిమాండ్ ను ప్రకారం19,000–19,500 మెగావాట్ల పీక్ డిమాండ్ మించే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో, విద్యుత్ సంస్థలు నెట్‌వర్క్ బలోపేతానికి దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఇబ్రహీంబాగ్, గచ్చిబౌలి, పటాన్‌చెరు, కందుకూరు, మేడ్చల్ డివిజన్‌లలో విద్యుత్ డిమాండ్ 20 శాతం చొప్పున పెరుగుతున్నదని, దీనికి తగ్గట్టుగా 40 శాతం మేర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు
2030నాటికి ఆరు వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లు
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, 2030 నాటికి 6,000 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం టార్గెట్ ఫిక్స్ చేసిందని సందీప్‌కుమార్ సుల్తానియా తెలిపారు. ఈ లక్ష్య సాధనలో ఈవీ చార్జింగ్ పాయింట్ ఆపరేటర్ల (సీపీఓ)తో విద్యుత్ సౌధలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుల్తానియా మాట్లాడుతూ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును వేగవంతం చేయాలని సూచించారు. రెడ్కో, డిస్కంలు చార్జింగ్ పాయింట్ ఆపరేటర్లకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాయని తెలిపారు. ఎల్టీ–9 కేటగిరీ కింద కాంట్రాక్టెడ్ లోడ్ లిమిట్‌ను 56కిలోవాట్/75హార్స్ వపర్ నుంచి 150 కిలోవాట్/201హార్స్ పవర్‌కు పెంచినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని, సలహాలు, సూచనలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.