మీకు లేని అధికారాలను ఆపాదించుకోవద్దు

మీకు లేని అధికారాలను ఆపాదించుకోవద్దు
  • గోదావరి బోర్డుకు తేల్చిచెప్పిన తెలంగాణ

హైదరాబాద్, వెలుగు : తనకు లేని అధికారాలను ఆపాదించుకోవద్దని గోదావరి రివర్​ మేనేజ్​మెంట్​బోర్డు (జీఆర్ఎంబీ)కు తెలంగాణ తేల్చిచెప్పింది. శుక్రవారం జలసౌధలో జీఆర్ఎంబీ చైర్మన్​ ముకేశ్​కుమార్ సిన్హా అధ్యక్షతన నిర్వహించిన బోర్డు సమావేశంలో తెలంగాణ, ఏపీ అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. బోర్డు మీటింగ్​ఎజెండాలో గోదావరి నదీ జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్​ఏర్పాటు చేయాలన్న ఏపీ విజ్ఞప్తిని చేర్చడంపై తెలంగాణ ఇంజినీర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ రీ ఆర్గనైజేషన్​యాక్ట్​లోని సెక్షన్​–85 ప్రకారం జీఆర్ఎంబీకి దాఖలు పరిచిన అధికారాలకు మాత్రమే పరిమితం కావాలని కోరారు.

నీటి పంపకాలపై ట్రిబ్యునల్ వేయాలంటే దానిని కేంద్రం వద్దనే తేల్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బోర్డు చైర్మన్​జోక్యం చేసుకొని తాము ఈ అంశంపై సమావేశంలో చర్చించబోమని ప్రకటించారు. కృష్ణా నదీ జలాల పున: పంపిణీకి కేంద్రం బ్రజేశ్​కుమార్​ట్రిబ్యునల్​కు బాధ్యతనిస్తూ జారీ చేసిన టీవోఆర్​పైన చర్చించాలనే అంశాన్ని ఎజెండాలో చేర్చడాన్ని కూడా తెలంగాణ తప్పు బట్టింది. గోదావరిపై టెలీ మెట్రీలు ఏర్పాటు చేసి నీటి వినియోగం లెక్క తేల్చాలన్న ఏపీ విజ్ఞప్తిని ఇంజినీర్లు తోసిపుచ్చారు.

కేవలం రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రమే టెలీమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, వాటిని నేషనల్​హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగానే ఏర్పాటు చేయాలని సూచించారు. జీఆర్ఎంబీకి అదనంగా సిబ్బందిని ఇవ్వాలన్న ప్రతిపాదనను రెండు రాష్ట్రాలు తిరస్కరించాయి. 2024 –25 ఆర్థిక సంవత్సరంలో బోర్డుకు రూ.16 కోట్ల బడ్జెట్​ఇవ్వాలని ప్రతిపాదించగా, రూ.8 కోట్లకు మించి వ్యయం కాదని, రూ.10 కోట్లు ఇస్తే సరిపోతుందని తెలిపారు.  బోర్డు ఫైనాన్షియల్​స్టేట్​మెంట్​ను ఆడిట్​చేయించి, రెండు రాష్ట్రాలకు పంపాలని కోరారు.