దేశంలో అత్యధిక సిజేరియన్​లు తెలంగాణలోనే

దేశంలో అత్యధిక సిజేరియన్​లు తెలంగాణలోనే
  •     దేశ సగటు కంటే రెండింతలు ఎక్కువ 
  •     కేంద్ర ఆరోగ్య శాఖ రిపోర్ట్‌‌లో వెల్లడి  

హైదరాబాద్, వెలుగు: దేశంలో అత్యధికంగా సిజేరియన్ డెలివరీలు జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ మరోసారి అపఖ్యాతిని మూటగట్టుకుంది. దేశంలో సగటున 23.29 శాతం సిజేరియన్ డెలివరీలు జరిగితే, అత్యధికంగా మన రాష్ట్రంలో 54.09 శాతం సిజేరియన్ డెలివరీలు జరిగాయని ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదికలో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 2020–21లో రాష్ట్రంలో 55.33 శాతం సిజేరియన్లు జరిగితే, ఆ తర్వాత ఏడాదిలో 54.09 శాతానికి తగ్గినట్టు రిపోర్ట్‌‌లో పేర్కొన్నారు. సిజేరియన్లను తగ్గించడానికి ఆరోగ్యశాఖ ప్రయారిటీగా పెట్టుకున్నప్పటికీ, ఏడాదిలో 1.24 శాతమే సిజేరియన్లు తగ్గాయి. కేంద్రం వెల్లడించిన లెక్కలు 2022 మార్చి చివరి నాటికేనని, ఇప్పుడు సిజేరియన్లు మరికొంత తగ్గాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు.  

ప్రైవేట్​లో తగ్గినయి.. సర్కార్ లో పెరిగినయి 

ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సిజేరియన్లను తగ్గించడాన్ని హరీశ్‌‌రావు సవాల్‌‌గా తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు గైనకాలజిస్టులు, హాస్పిటళ్ల సూపరింటెండెంట్లతో వరుసగా రివ్యూలు చేశారు. అనవసర సిజేరియన్లు చేసే ప్రైవేటు హాస్పిటళ్లపై చర్యలు తీసుకున్నారు. వీటన్నింటితో కొంత వరకు ఫలితం వచ్చినట్టు కేంద్రం వెల్లడించిన రిపోర్ట్‌‌తో తెలుస్తోంది. 2020–2021 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో 65.34 శాతం సిజేరియన్ డెలివరీలు జరిగితే, ఆ తర్వాత ఏడాదిలో 61.08 శాతానికి తగ్గాయి. ప్రభుత్వ దవాఖాన్లలో పరిస్థితి రివర్స్‌‌ అయింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 46.3 శాతం సిజేరియన్లు జరిగితే,  ఆ తర్వాతి ఏడాది 47.13 శాతానికి సిజేరియన్లు పెరిగినట్టు రిపోర్ట్‌‌లో పేర్కొన్నారు.  

కేరళ, తమిళనాడులోనూ..

కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసే ఆరోగ్య సూచీల్లో తొలి రెండు స్థానాల్లో ఉండే కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ సిజేరియన్ల రేటు దేశ సగటు కంటే ఎక్కువగానే ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో కేరళలో 42.41% సిజేరియన్లు జరిగితే, తమిళనాడులో 46.94% సిజేరియన్లు జరిగాయి. పంజాబ్, ఏపీ, గోవా, వెస్ట్ బెంగాల్‌‌ రాష్ట్రాల్లోనూ ఏటా 40 శాతానికి పైగానే సిజేరియన్లు జరుగుతున్నట్టు రిపోర్ట్‌‌లో పేర్కొన్నారు. అత్యల్పంగా బీహార్‌‌‌‌లో 5.66 శాతం సిజేరియన్లు జరుగుతుండగా, యూపీ, జార్ఖండ్‌‌, మధ్యప్రదేశ్‌‌, రాజస్థాన్‌‌, మేఘాలయ, మిజోరం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 20 శాతంలోపు సిజేరియన్ డెలివరీలు, 80 శాతం నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయి.