Telangana Tour : కోరిన కోర్కెలు తీర్చే పొలాస వెయ్యి శివ లింగాల ఆలయం

Telangana Tour : కోరిన కోర్కెలు తీర్చే పొలాస వెయ్యి శివ లింగాల ఆలయం

శివాలయాలలో శివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. ఏ ఆలయంలో అయినా ప్రధానంగా లింగం ఒకటే ఉంటుంది. కానీ జగిత్యాల జిల్లా, పొలాస గ్రామంలో మాత్రం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా వెయ్యి లింగాలు ఒకేచోట కొలువుదీరి ఉన్నాయి. భక్తులు ఆ లింగాలను దర్శించుకుని, అభిషేకాలు నిర్వహించి కోర్కెలు తీర్చమని మొక్కుకుంటున్నారు. ఈ వెయ్యిలింగాల ప్రతిష్ఠ వెనక ఆసక్తికరమైన కథనం ఉంది.

చరాచర జగత్తు శివ రూపం అని భక్తులు నమ్ముతారు. శివ శబ్దంలోనే సర్వశక్తులు ఉన్నాయని భావిస్తారు. మనిషిలోని అజ్ఞానాన్ని తొలగించడానికే శివుడు లింగరూపంలో కనిపిస్తాడని చెప్తారు. అలాంటి లింగాలు వెయ్యి ఉండడంతో ఇక్కడకు భక్తులు ఎక్కువగా వస్తున్నారు. 

ఎందుకు కట్టారంటే..

ఈ గుడి కట్టకముందు పొలాస గ్రామ ప్రజలు వెయ్యి లింగాలను తయారు చేసి, పూజించి, తర్వాత నీటిలో కలిపే వాళ్లు. అలా ప్రతి ఏడాది చేయడం కష్టమనిపించి నలమాస గంగాధర్ వెయ్యి లింగాలతో ఒక గుడి నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. తనతోపాటు, గ్రామస్తుల ఆర్థిక సహాయం, సహకారం తీసుకున్నాడు. కొంతమందితో కలిసి ట్రస్టు ఏర్పాటు చేశాడు. ఆ ట్రస్టు ఆధ్వర్యంలో వెయ్యి లింగాలను తయారు చేయించి, 2015లో ఈ లింగాలను ప్రతిష్ఠించారు.

వెయిలింగాల వైభోగం

భక్తులు వెయ్యి లింగాలను ఒకేసారి దర్శించుకుని ఆనందిస్తారు. ఒక్కో వేదికపై రెండు లింగాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. అలాగే ఇక్కడున్న శివ పంచాయతనం (గణపతి, అంబిక, సూర్యుడు, నారాయణుల మధ్య శివలింగం) విగ్రహాల సమాహారం గురించి భక్తులు విశేషంగా చెప్పుకుంటారు. వీళ్లందరినీ ఒకేచోట, ఒకేసారి అభిషేకించి, పూజిస్తే ముక్తి లభిస్తుందని అంటారు. అలాగే వెయ్యి శివలింగాలకు అభిషేకాన్ని తప్పకుండా చేయిస్తారు. పసుపు, కుంకుమ, పాలు, తేనె, చక్కెర, పెరుగు, పువ్వులు.. వంటి వాటితో లింగాలను పూజిస్తారు. అలా పూజించడం వల్ల సకల సుఖాలు లభిస్తాయని నమ్ముతారు. ఒకేసారి వెయ్యిమంది భక్తులతో జరిగే ఈ పూజాకార్యక్రమాలు కనులపండుగలా జరుగుతాయి.

ఇతర ఆలయాలు

పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణంలో ఉద్యానవనం మధ్యలో ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే వీరభద్రుడు, కాలభైరవుడు, పాముల జంట, వినాయకుడు, నవగ్రహాలు, గోశాల.. వంటివి ఎన్నో ఉన్నాయి. వీరభద్రుడు, కాలభైరవుడు.. ఇద్దరూ గుడి ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఉన్నారు. ఇక్కడ భైరవుడ్ని సంహార కాలభైరవుడిగా పిలుస్తారు. ప్రధాన దారికి మధ్యలో వినాయకుడి విగ్రహం ఉంది.

భక్తులు ముందుగా వినాయకుడిని, ఆ తర్వాత వీరభద్రుడిని, కాలభైరవుడిని పూజించి, తర్వాత సహస్రలింగాలను దర్శించుకుంటారు. పాలరాతి విగ్రహాలలో దత్తాత్రేయడు, నరసింహస్వామి... వంటి దేవుళ్లు ఎందరో ఈ ప్రాంగణంలో కనిపిస్తారు. పొలాస గ్రామ ప్రజలే కాకుండా, జగిత్యాలలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు.