Telangana Tour : దసరా సెలవుల్లో చల్లగా సేదతీరి వద్దామా : కొంగల వాటర్ ఫాల్

Telangana Tour : దసరా సెలవుల్లో చల్లగా సేదతీరి వద్దామా : కొంగల వాటర్ ఫాల్

వీకెండ్ టూర్ బోర్ కొట్టకుండా ఉండాలంటే కొత్త ప్రదేశానికి వెళ్లాలి. అది కూడా పచ్చని చెట్లు, వాగులు వంకలు, కొండలతో చూడగానే నచ్చే ప్లేస్ అయితే మరీ బాగుంటుంది. అలాంటిదే కొంగల వాటర్ ఫాల్. ఇక్కడ నల్లని రాళ్ల దొంతర మీద నుంచి నీళ్లు ధారగా కాకుండా జల్లుల్లా కిందకి పడుతున్న దృశ్యం భలేగా అనిపిస్తుంది. ములుగు జిల్లా, వాజేడు మండలంలోని కొంగల ఊళ్లో ఉంది ఈ జలపాతం.

'తెలంగాణ నయగరా'గా పేరొందిన బొగత వాటర్ ఫాల్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది కొంగల జలపాతం. ఒకప్పుడు పులులు ఇక్కడికి నీళ్లు తాగడానికి వచ్చేవట. అందుకే ఈ వాటర్ ఫాల్ని 'పులిమడుగు' అని కూడా పిలుస్తారు. కొంగల ఊరి నుంచి మూడు కిలోమీటర్ల దూరం ఉన్న వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్లాలంటే దాదాపు నలభై నిమిషాలు ట్రెక్కింగ్ చేయాలి. కాలి నడకన పంట పొలాలు, పిల్ల కాల్వలు, రాళ్లు రప్పలు దాటుకుంటూ వెళ్తుంటే అడ్వెంచర్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అలాగే, దారిపొడవునా రంగురంగుల సీతాకోకచిలుకలు పలకరిస్తాయి. ఇక్కడ డెబ్బై అడుగుల ఎత్తు నుంచి నీళ్లు కిందకి దుంకుతాయి. జలపాతం నీళ్లు పడే చోటు స్విమ్మింగ్ పూల్ ని తలపిస్తుంది. వీకెండ్ లో చాలామంది ఫ్రెండ్స్, ఫ్యామిలీతో పాటు వచ్చి ఇక్కడ మూడు నాలుగ్గంటలు సరదాగా గడిపి వెళ్తుంటారు. జూలై, డిసెంబర్ నెలల మధ్య ఇక్కడికి వెళ్తే జలపాతం అందాల్ని చూడొచ్చు.

ఇలా వెళ్లాలి

హైదరాబాద్ నుంచి 271 కిలోమీటర్లు ప్రయాణిస్తే కొంగల వాటర్ ఫాల్ కి చేరుకోవచ్చు. వరంగల్ నుంచి వెళ్లేవాళ్లు 129 కిలోమీటర్లు జర్నీ చేయాలి. కొంగల ఊరి నుంచి మట్టిరోడ్డు మీదుగా కిలోమీటర్ వరకు మాత్రమే బైక్, కారులో వెళ్లడానికి వీలవుతుంది. అక్కడి నుంచి గైడ్ సాయంతో నడుచుకుంటూ వెళ్లాలి.