విద్యుత్ స్కాం అబద్ధం.. ఉత్పత్తి భారీగా పెంచాం : ట్రాన్స్ కో & జెన్ కో

విద్యుత్ స్కాం అబద్ధం.. ఉత్పత్తి భారీగా పెంచాం : ట్రాన్స్ కో & జెన్ కో

విద్యుత్ సౌధ : విద్యుత్ కొనుగోళ్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన కామెంట్స్ ను తప్పుపట్టారు ట్రాన్స్ కో అండ్ జెన్ కో CMD ప్రభాకర్ రావు. విద్యుత్ కొనుగోళ్లపై ఏ విచారణకైనా సిద్ధమని.. ఆరోపణలు చేస్తున్నవారికి  సవాల్ విసిరారు. హైకోర్ట్, సుప్రీంకోర్టు, CBI విచారణ కూడా తాము సిద్ధమే అన్నారు. విద్యుత్ కొనుగోళ్లపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వానికి,  ప్రజలకు ద్రోహం చేయాలన్న ఆలోచన తమకు రాదని అన్నారు.

NTPC రూ.4.30 టారిఫ్ కు సోలార్ పవర్ ఇవ్వడానికి ముందుకు రాలేదనీ.. రాత్రి రాత్రికే రూ.5.50 టారిఫ్ తో బిడ్డింగ్ రూట్లో సోలార్ పవర్ ఒప్పందాలు చేసుకున్నామన్న ఆరోపణలు తప్పు అన్నారు ప్రభాకర్ రావు. తెలంగాణ విద్యుత్ రంగంలో భారీ కుంభకోణం జరిగిందన్నది కూడా అవాస్తవమే అన్నారు. విద్యుత్ సంస్థల నిర్వహణ  నిర్ణయాలలో ప్రభుత్వ ఒత్తిళ్ళు లేవన్నారు. విద్యుత్తు  కొనుగోలు ఒప్పందాలన్నీ పారదర్శకంగా, అవినీతి లేకుండా జరిగినవే అని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క మెగావాట్ కూడా ఉత్పత్తి కాలేదని ఆరోపణలు చేస్తున్నారనీ.. వాస్తవం ఏమిటంటే భూపాలపల్లి లో 600 మెగావాట్లు, పులిచింతలలో 120 మెగావాట్లు, KTPS పాల్వంచలో 800 మెగావాట్లు, జైపూర్ సింగరేణిలో 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించామని చెప్పారు.

తెలంగాణ ఏర్పాటు అయ్యేనాటికి 71 మెగావాట్లు ఉన్న సోలార్ విద్యుత్తు… ప్రస్తుతం 3600 మెగావాట్లు ఉత్పత్తికి చేరిందనీ.. మన రాష్ట్రం సోలార్ ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు సీఎండీ ప్రభాకర్ రావు. రాష్ట్రం ఏర్పాటు అయ్యే నాటికి 7వేల 778 మెగావాట్లు ఉన్న విద్యుదుత్పత్తి సామర్థ్యం… నాలుగున్నర ఏండ్లలో 16వేల203 మెగావాట్ల కు చేరిందని చెప్పారు ప్రభాకర్ రావు.