పోడుకు సై అన్నట్టా.. నై అన్నట్టా.. తెలియకనే అడవిలో అలజడి

పోడుకు సై అన్నట్టా.. నై అన్నట్టా.. తెలియకనే  అడవిలో అలజడి

అట్లన్నరు

పోడు భూముల సమస్యల పరిష్కారం మన చేతుల్లో ఉంటది. నేనే వచ్చి కూర్చుంటా. గిరిజన జిల్లాలకు ఆఫీసర్లను వెంటపెట్టుకొని వస్తా. పోడు భూముల లొల్లి ఎక్కడో ఓ కాడ అంతం కావాలే. గిరిజనుల భూములకు రైతుబంధు, హక్కులు రావాలే. గవర్నమెంట్ వచ్చినంక ఆరు నెలల్లో ఈ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తా.

– గతేడాది నవంబర్‌‌‌‌ 23న అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్

ఇట్లన్నరు

జంగిల్ బచావో, జంగిల్ బడావో నినాదంతో అధికారులు ముందుకెళ్లాలి. ఓ వైపు హరితహారం నిర్వహిస్తూ, మరోవైపు అడవులు అంతరించిపోతుంటే చూస్తూ కూసుంటే లాభం ఉండది. అడవిని కాపాడేందుకు కఠినంగా వ్యవహరించాలి. అంగుళం కూడా ఆక్రమణకు గురి కావొద్దు.  టీఆర్​ఎస్​ వాళ్లనయినా వదలొద్దు. పోలీసులు, అటవీశాఖ కలిసి పని చేయాలి.

– జనవరి 26న ప్రగతిభవన్‌‌‌‌లో ఫారెస్ట్ డిపార్టుమెంట్ రివ్యూలో సీఎం

పోడు భూములపై ప్రభుత్వం రెండు రకాల వైఖరి అవలంబిస్తోంది. ఓవైపు హక్కులు కల్పిస్తామని గిరిజనులను ఊరిస్తూనే… మరోవైపు అడవి భూములను సంరక్షించేందుకు ఉక్కుపాదం మోపాలని అటవీ శాఖను పురమాయిస్తోంది. దీంతో అటవీ భూములు సాగు చేసుకుంటున్న రెండు లక్షల మంది గిరిజన రైతులు.. ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్‌‌‌‌ సిబ్బంది అడకత్తెరలో పోక చెక్కలా నలిగిపోతున్నారు. తమకు ఏరోజైనా హక్కులు వస్తాయన్న ఆశతో  రైతులు దుక్కులు దున్నుతుంటే.. అవే భూముల్లో హరితహారం కింద ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు మొక్కలు నాటుతున్నారు. దీంతో అనేకచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. పోడు భూములన్నీ రణ క్షేత్రాలను తలపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రోజుకోచోట ఘర్షణలు జరుగుతున్నాయి.

ఊరిస్తున్న హక్కులు, రైతుబంధు

గత అసెంబ్లీ ఎన్నికల టైంలో పోడు భూముల సమస్య తీరుస్తానని సీఎం కేసీఆర్‌‌‌‌ స్వయంగా హామీ ఇచ్చారు. దీంతో త్వరలోనే తమకు హక్కు పత్రాలు వస్తాయని గిరిజన రైతులు ఎదురుచూస్తున్నారు. ఎకరానికి రూ.10 వేల చొప్పున ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు సాయం అందుతుందని ఆశతో ఉన్నారు. కానీ ఇప్పటివరకు హక్కులిచ్చే ప్రతిపాదనలేమీ ప్రభుత్వం తయారు చేయలేదు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన సమయంలోనే పోడు భూములపై స్పష్టత ఇవ్వకుండా దాటవేయటం సమస్యను మరింత పెంచింది. మరోవైపు అడవులను స్వాధీనం చేసుకునేందుకు కఠిన వైఖరి అనుసరిస్తుండడంతో రైతులు, ఫారెస్ట్ సిబ్బందికి మధ్య చిచ్చు రేగుతోంది. 2006లో ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎం వైఎస్సార్‌‌‌‌ రాష్ట్రవ్యాప్తంగా పోడు భూములకు ఫారెస్ట్  రైట్‌‌‌‌ యాక్ట్ హక్కు పత్రాలు అందించారు. 1,83,107 మంది దరఖాస్తు చేసుకుంటే… 93,494 మందికి హక్కు పత్రాలు అందించారు. 80,890 అప్లికేషన్లను తిరస్కరించారు. మరో 8,723 అప్లికేషన్లను పెండింగ్‌‌‌‌లో పెట్టారు. అప్పట్నుంచీ ఇప్పటివరకు హక్కు పత్రాలు ఇవ్వలేదు.

హరితహారంతో పోడు మంటలు
వైఎస్‌‌‌‌ హయాంలో రైతులకు ఇచ్చేందుకు నిరాకరించిన 3.30 లక్షల ఎకరాల అటవీ భూములు ఇప్పటికీ రైతుల అధీనంలోనే ఉన్నాయి. వీటికి తోడు గడిచిన పదేళ్లలో మరో 4.06 లక్షల ఎకరాల భూములు ఇతరుల చేతిలో ఉన్నట్టు గూగుల్​ మ్యాప్​లు, సర్వేల ద్వారా ఫారెస్ట్ విభాగం గుర్తించింది. మొత్తం 7.36 లక్షల ఎకరాల భూములు ఇతరుల అధీనంలో ఉన్నాయని, వాటిని తిరిగి ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే అడవులకు దగ్గరలో ఉన్న పోడు భూముల్లో హరితహారం కింద మొక్కలు నాటాలని ఆదేశించింది. ఈసారి ఏకంగా యాభై కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్​ అప్పగించింది. ఇక్కడే పోడు భూముల్లో చిచ్చు రగులుతోంది. గడిచిన పదేళ్లలో భూముల విలువ అమాంతం పెరిగిపోయింది. అటవీ భూములు దున్నుకుంటున్న గిరిజన రైతుల ఆశలు పెరిగాయి. గిరిజనులతో పాటు గిరిజనేతరులు అడవులను సేద్యం చేసేందుకు పోటీ పడ్డారు. పట్టాలిప్పించాలని అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగి ఆందోళనలకు దిగారు. ఇటీవల ఏటూరునాగారంలో తెలంగాణ జనసమితి అధ్వర్యంలో కోదండరాం, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అధ్వర్యంలో నేతలు ఆందోళన నిర్వహించారు. పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్​ చేశారు. అనేకచోట్ల ఫారెస్ట్ సిబ్బంది తమ భూములను లాక్కుంటున్నారని తిరగబడేందుకు రైతులు వెనుకాడటం లేదు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాలతోనే తాము మొక్కలు నాటుతున్నామంటూ అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే దాడులు, పోలీస్‌‌ కేసులు నమోదవుతున్నాయి.

రెవెన్యూతో తెగని పంచాయితీ
కొన్ని జిల్లాలలో ఇప్పటికీ అటవీ, రెవెన్యూ శాఖల మధ్య భూమి హద్దుల పంచాయితీ సమసిపోలేదు. ఉదాహరణకు మహబూబాబాద్‌‌ జిల్లాలో సుమారు 75 వేల ఎకరాల భూమి కోసం ఈ రెండు శాఖలు కుస్తీ పడుతున్నాయి. ఇప్పటికే వేలాది మంది రైతులకు ఇక్కడ రెవెన్యూ అధికారులు పట్టాదారు పాస్‌‌ పుస్తకాలు ఇచ్చారు. కానీ ఇవి చెల్లుబాటు కావని అటవీ శాఖ అడ్డుపడింది. ఇప్పుడీ రైతుల పేర్లు పహణీలో కాస్తు కాలమ్‌‌లోనే వస్తున్నాయి. పట్టా కాలమ్‌‌లో ప్రభుత్వ భూమి అని నమోదైంది. వరంగల్​ ఉమ్మడి జిల్లాలోని నెల్లికుదురు మండలం నారాయణపురం గ్రామం మొత్తం ఫారెస్ట్‌‌ భూమిలోనే ఉంది. వందేళ్ల కిందట ఈ గ్రామంలోని రైతుల భూమి అంతా అటవీశాఖ పరిధిలోకి వచ్చింది. ఊరి ప్రజలంతా అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి బేజారయ్యారు.

2006లో పోడు చిట్టా..

పోడు భూముల
విస్తీర్ణం (ఎకరాల్లో)   6,30,714

దరఖాస్తు చేసుకున్న
గిరిజన రైతులు      1,83,107

పట్టాలు
అందుకున్నవారు   93,494

హక్కు పత్రాలు ఇచ్చిన
భూములు(ఎకరాల్లో)  3,00,092

ఇప్పటి ప్రభుత్వ లెక్కల ప్రకారం

రాష్ట్రంలో
అటవీ భూములు    67,25,925

ఇతరుల చేతుల్లో
ఉన్న భూములు    7,36,732

 

 

2006లో
పట్టాలందుకోని అర్జీదారులు

జిల్లా                   రైతులు

ఖమ్మం                  29,604

ఆదిలాబాద్​              19,177

వరంగల్​                 23,941

నిజామాబాద్​            8,508

నల్గొండ                 4,930

మెదక్​                   1,100

రంగారెడ్డి                1,929

మహబూబ్​నగర్​        424

నోట్‌‌: ఇవిగాక 2006 తర్వాత లక్షన్నర అప్లికేషన్లు ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పెండింగ్‌‌లో ఉన్నాయి.

 

బ్యాంకుల అప్పులిస్తలేరు

మా తాత ముత్తాతల కాలంలో పోడు చేసుకున్న భూమికి ఇప్పటివరకు ప్రభుత్వాలు పట్టాలు ఇవ్వడం లేదు. దీంతో మాకు ప్రభుత్వం నుంచి వచ్చే లాభాలు అందడం లేదు. కనీసం బ్యాంకు నుంచి రుణం తీసుకుందామంటే పాసు బుక్కులు లేక ఇబ్బందులు పడుతున్నం.
ఎన్ని ప్రభుత్వాలు మారిన మా బతుకులు మారడం లేదు.

– ఇనుముల మల్లేశ్, పోడు రైతు, బోర్లగూడెం, మహాముత్తారం మండలం

 

పంట అమ్ముకోలేకపోతున్నం

మేం పోడు భూముల్లో వరి పంట పండిస్తున్నాం. దిగుబడి మంచిగనే వస్తోంది. కానీ మాకు హక్కు పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వ వడ్ల కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోలేక పోతున్నం. తక్కువ ధరకు దళారులకే వడ్లను అమ్మాల్సి వస్తోంది. రైతుబంధు సాయం కూడా మాకు అందడం లేదు. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు కూడా ఇస్తలేరు.

– సామల పాపయ్య, రైతు, లక్ష్మీనగరం, వెంకటాపురం మండలం