
రెండు వారాల్లో ముగుస్తున్న
ఏడుగురు వీసీల టర్మ్
హైదరాబాద్,వెలుగు: అసలే పాలకమండళ్లు లేక అల్లాడుతున్న రాష్ట్ర వర్సిటీల్లో వైస్ చాన్సలర్ల కొరత ఏర్పడబోతోంది. ఈ నెలాఖరుతో దాదాపు అన్ని యూనివర్సిటీల్లో వీసీల కాల పరిమితి పూర్తి కానుంది. కొత్త వారి ఎంపికకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం నేటి వరకూ సెర్చ్ కమిటీలనూ వేయలేదు. దీంతో వర్సిటీల నిర్వహణ ఎలా అని విద్యాశాఖ పెద్దాఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో ఆరు సంప్రదాయ కోర్సులను బోధిస్తున్నాయి. మిగతా ఐదు టెక్నికల్ కోర్సులు చెబుతున్నాయి.
కరీంనగర్ లోని శాతవాహన, బాసరలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక యూనివర్సిటీలకు తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి వీసీలను నియమించలేదు. వీటిలో ఇన్ చార్జ్ వీసీల పాలన సాగుతోంది. జూన్ 30న నల్లగొండలోని మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ కాల పరిమితి ముగిసింది. ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, తెలంగాణ, జేఎన్‌టీయూహెచ్, పొట్టి శ్రీరాములు తెలుగు, డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీల వీసీల మూడేళ్ల కాల పరిమితి ఈ నెల25తో ముగుస్తుంది. ఒక్క ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ వీసీకి మాత్రమే వచ్చే జనవరి వరకూ పదవి కాలం ఉంది.
సెర్చ్ కమిటీలు ఎక్కడ?
వీసీల పదవీకాలం ముగియడానికి కనీసం నెల రోజుల ముందే కొత్త వీసీల కోసంసెర్చ్ కమిటీని ఏర్పాటు చేయాలి. కానీ ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక్క కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. వీసీల్లేక ఆర్ జేయూకేటీ, శాతవాహనా వర్సిటీల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇన్ చార్జ్ వీసీలుగా ఉన్న వాళ్లు నెలలో ఒకటి, రెండు సార్లయినా వాటి వైపు చూడటం లేదు. అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వర్సిటీ వీసీల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్, సెర్చ్ కమిటీల కోసం విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ వాటిని ఇంకా ఆమోదించలేదని సమాచారం.