బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రాధాన్యం

బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రాధాన్యం

పటాన్​చెరు,వెలుగు : పటాన్​చెరులోమూడు రోజులుగా చేపట్టిన తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్తక సభ చతుర్వేద సదస్సులు, తెలంగాణ విద్వత్ పరీక్షలు సోమవారం ముగిసాయి.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిట్టల్,  కలెక్టర్ శరత్ కుమార్, ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన 150 మంది వేద పాఠశాల విద్యార్థులకు విద్వత్ పరీక్షలు నిర్వహించి పట్టా సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం  నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. హిందూ ధర్మ పరిరక్షణలో బ్రాహ్మణుల పాత్ర అత్యంత క్రియాశీలకమైనదని అన్నారు.

ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి మాట్లాడుతూ..హిందూ ధర్మ పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న బ్రాహ్మణుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎల్లప్పుడు అండగా ఉన్నారని కొనియాడారు. బీరంగూడ గుట్టపై వేద పాఠశాలను నిర్మించడంతో పాటు వసతి గృహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, పటాన్​చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఆర్డీవో రవీందర్ రెడ్డి, తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్తక సభ అధ్యక్షుడు రామకృష్ణ శర్మ, బ్రాహ్మణ సమాజం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ శర్మ, గూడెం మధుసూదన్ రెడ్డి, వేద బ్రాహ్మణులు పాల్గొన్నారు. 

మార్కెట్​యార్డుని తీర్చిదిద్దుతాం..

పటాన్​చెరు వ్యవసాయ మార్కెట్ యార్డుని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం వ్యవసాయ మార్కెట్ యార్డులో దుకాణ సముదాయాల నిర్మాణ పనులకు మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు.