గల్ఫ్ లో తెలంగాణ వాసి నరకయాతన..సుష్మకు KTR రిక్వెస్ట్

గల్ఫ్ లో తెలంగాణ వాసి నరకయాతన..సుష్మకు KTR రిక్వెస్ట్

ఉపాధి కోసం అబుదాబి వెళ్లిన తెలంగాణ వాసి అక్కడ నరకయాతన అనుభవిస్తున్నాడు. పని కోసం వెళ్లిన అతను వెట్టిచాకిరి చేస్తూ పస్తులుంటూ.. యాజమాని చేతుల్లో చావు దెబ్బలు తింటున్నాడు. ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి వెళ్లాననీ.. తనను స్వదేశానికి వచ్చేలా చేయాలని సోషల్ మీడియా ద్వారా వేడుకుంటున్నాడు.

కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం మక్తపల్లి గ్రామానికి చెందిన వీరయ్య 2017లో బతుకు దెరువు కోసం గల్ఫ్ వెళ్ళాడు. అబుదాబికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశంలో ఉంటున్నాడు. అక్కడ ఓ షేక్ వద్ద ఒంటెలు చూసుకుంటున్నాడు. అయితే  ఆ యజమాని మాత్రం వెట్టిచాకిరి చేయించుకుంటూ జీతం ఇవ్వకుండా భోజనం పెట్టకుండా.. చిత్రహింసలు పెడుతున్నాడంటూ  వీరయ్య  తన గోడును వీడియో ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించుకున్నాడు. తెలంగాణలో తమ భార్య బిడ్డలు అనాధలై దిక్కుతోచని స్థితిలో ఆస్పత్రిలో ఉన్నారని.. తన తల్లి చనిపోతే అంత్యక్రియలకు  కూడా వెళ్లనివ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దయచేసి తాను ఇంటికి వచ్చేలా చూడండి అంటూ వేడుకున్నాడు వీరయ్య.

ఈ వీడియోను ఓ నెటిజన్ టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ట్యాగ్ చేశారు. వెంటనే స్పందించిన కేటీఆర్  “ఈ విషయంలో కేంద్రమంత్రి సుష్మస్వరాజ్ సాయం చేయాల్సిందిగా కోరుతున్నా.  వీరయ్య ఎలాగైనా భారత్ కు వచ్చేలా చూడండి” అంటూ ట్విట్టర్లో కోరారు.