V6 News

నిర్మాణ రంగంలో నారీ భేరీ!..సెంట్రింగ్‌ బిజినెస్‌ తో నెలకు రూ.లక్ష సంపాదన

నిర్మాణ రంగంలో నారీ భేరీ!..సెంట్రింగ్‌ బిజినెస్‌ తో నెలకు రూ.లక్ష సంపాదన
  • ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా రంగంలోకి ఇందిరా మహిళా శక్తి
  • సాఫ్ట్​వేర్ వైపు వెళ్లకుండా స్వయం ఉపాధి బాటలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ వనజ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మహిళలు ఇంటి పని, కుట్టు పనికి పరిమితం కాకుండా నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టి రికార్డు సృష్టిస్తున్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ప్రభుత్వ ప్రోత్సాహంతో బిజినెస్ ఉమెన్​గా ఎదుగుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ఉపాధి అవకాశంగా మార్చుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. ఇందుకు వనపర్తి జిల్లాకు చెందిన వనజ అనే యువతి సాధిస్తున్న విజయమే నిదర్శనం. వనపర్తి జిల్లా పానగల్ మండలం బండపల్లి గ్రామానికి చెందిన పెద్దబుడి వనజ (30) కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది.

ఐటీ కంపెనీలోనో ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా భిన్నంగా ఆలోచించింది. నిర్మాణ రంగంలో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసింది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా శిక్షణ పొందింది. సెర్ప్ సహకారంతో రూ.20 లక్షల బ్యాంక్ లింకేజీ రుణం పొందింది. తన గ్రామంలో సెంట్రింగ్ యూనిట్‌ను ప్రారంభిం చింది. ప్రస్తుతం మూడు యూనిట్లను నడుపుతూ నెలకు దాదాపులక్ష వరకు ఆదాయం సంపాదిస్తోంది. 

సర్కారు చూపిన ఉపాధి

2025-–26 ఆర్థిక సంవత్సరంలో 3.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మాణ సామగ్రికి పెరిగే డిమాండ్‌ను గమనించిన ప్రభుత్వం మహిళలను ఈ రంగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించింది. సెంట్రింగ్ పనులు, సిమెంట్ ఇటుకల తయారీలో మహిళలకు శిక్షణ ఇప్పిస్తే.. ఒకవైపు ఇండ్ల నిర్మాణం వేగంగా జరుగుతుందని, మరోవైపు మహిళలకు సుస్థిర ఆదాయం లభిస్తుందని భావిస్తున్నది.

స్పెషల్ ట్రైనింగ్​

సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ మార్గదర్శకత్వంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (నాక్) సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా 772 మంది మహిళలకు ఉచిత శిక్షణ ఇచ్చారు. ఇందులో చెక్క, ఉక్కు, అల్యూమినియం సెంట్రింగ్ సిస్టమ్స్, డిజైన్ డ్రాయింగ్స్ అర్థం చేసుకోవడం, వర్క్ ఫ్లో మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై లోతైన అవగాహన కల్పించారు. శిక్షణ పొందిన వారిలో ఇప్పటికే 154 మంది తమ సొంత యూనిట్లను ఏర్పాటు చేయగా, మరో 16 మంది పీఎంఈజీపీ కింద దరఖాస్తు చేసుకున్నారు. మహిళలు కొత్త తరహా వ్యాపారాల్లోకి రావాలని,  ఆడబిడ్డలు ధైర్యంగా ముందడుగు వేస్తే కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం కష్టమేమీ కాదని  మంత్రి సీతక్క పేర్కొన్నారు. 

స్వయం ఉపాధి పొందుతున్నా

ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా సొంతంగా బిజినెస్​ చేయాలనుకున్న. నాకు అండగా నిలిచిన మంత్రి సీతక్కకు, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం వల్లే నేను ఈ రోజు ఆర్థికంగా నిలదొక్కుకున్నా. నెలకు రూ. లక్ష సంపాదిస్తున్నా.- వనజ, సెంట్రింగ్​ నిర్వాహకురాలు