సర్పంచ్కు గౌరవం లేకపోతే.. గ్రామ స్వరాజ్యానికి అర్థం ఏమిటి?

సర్పంచ్కు గౌరవం లేకపోతే.. గ్రామ స్వరాజ్యానికి అర్థం ఏమిటి?

‘భారతదేశం ఆత్మ దాని గ్రామాలలో నివసిస్తుంది’ అని మహాత్మా గాంధీ చెప్పిన మాట కేవలం ఒక నినాదం కాదు. భారత   ప్రజాస్వామ్యతత్వానికి మూలసూత్రం.  గ్రామం బతికితేనే  దేశం బతుకుతుంది. గ్రామ నాయకత్వం బలపడితేనే  ప్రజాస్వామ్యం బలపడుతుంది.  కానీ నేడు మన రాజకీయ వ్యవస్థలో అత్యంత విస్మరణకు గురవుతున్నది కూడా గ్రామమే.   ఒక గ్రామానికి నాయకత్వం వహించేది సర్పంచ్.  

ప్రజాస్వామ్యం అంటే కేవలం పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ కాదు. శాసనసభ కాదు. సచివాలయాల గోడల మధ్య నడిచే పాలన మాత్రమే కాదు.  ప్రజాస్వామ్యం ప్రతి గ్రామంలో,  ప్రతి గ్రామసభలో,  ప్రతి పంచాయతీ కార్యాలయంలో సజీవంగా ఉండాలి. ప్రజాస్వామ్యానికి తొలి ప్రతినిధి సర్పంచ్. రాజ్యాంగం నిర్మించిన మూడు అంచెల ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామ పంచాయతీ చివరి మెట్టు కాదు. అదే తొలి మెట్టు. అదే పునాది. 

ఒక గ్రామంలో పుట్టుక నమోదు చేయించుకోవాలన్నా, మరణ ధ్రువీకరణ పొందాలన్నా, తాగునీటి సమస్య పరిష్కరించాలన్నా, పారిశుద్ధ్య లోపాలను సరిచేయాలన్నా, రైతుకు భూ సమస్య వచ్చినా, వృద్ధాప్య పెన్షన్ ఆగిపోయినా, ఇంటి స్థల వివాదం తలెత్తినా ప్రజలు ముందుగా ఆశ్రయించేది సర్పంచ్‌‌‌‌‌‌‌‌నే,  ఢిల్లీని కాదు.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను కాదు.  గ్రామ ప్రజలకు  ప్రభుత్వానికి మధ్య మొదటి వారధి సర్పంచే.  

అయితే విచిత్రం ఏమిటంటే ప్రజలకు అత్యంత చేరువగా ఉండే  ఈ ప్రజాప్రతినిధికే  అత్యల్ప గౌరవం,  అత్యల్ప గుర్తింపు లభిస్తోంది. బాధ్యతలు అపారం. అధికారాలు  మాత్రం పరిమితం. జవాబుదారీతనం పూర్తిగా సర్పంచ్​ భుజాలపైనే..  కానీ వ్యవస్థ ఇచ్చే గౌరవం  మాత్రం నిరాశ  కలిగించే స్థాయిలో ఉంది.

  • ఎంపీ, ఎమ్మెల్యేకి ఒక న్యాయం..   సర్పంచ్‌‌‌‌‌‌‌‌కు మరో న్యాయమా?

ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, సర్పంచ్ అయినా వారి ప్రజాస్వామ్య చట్టబద్ధత ఒకటే.  కానీ వారికి లభించే గౌరవం,  సదుపాయాలు, భద్రత మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.  ఒకసారి ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా ఎన్నికైతే వేతనాలు, భత్యాలు, వాహన సదుపాయాలు, సిబ్బంది సహాయం, వైద్య సదుపాయాలు,  పదవీకాలం ముగిసిన తర్వాత కూడా పెన్షన్లు లభిస్తాయి.  

కానీ  ఐదేళ్లు  గ్రామ ప్రజల కోసం నిరంతరం పనిచేసిన  సర్పంచ్  పదవీకాలం పూర్తికాగానే సాధారణ పౌరుడిగా మిగిలిపోతాడు.  పెన్షన్ ఉండదు. ఆరోగ్య భద్రత ఉండదు. కుటుంబానికి రక్షణ ఉండదు. తెలంగాణలో  ముఖ్యమంత్రి,  మంత్రులు, ఉన్నత ప్రజాప్రతినిధులకు  దేశంలోనే  అత్యున్నతస్థాయి వేతనాలు, సదుపాయాలు ఉన్నాయి. అలాంటి రాష్ట్రంలో గ్రామస్థాయి ప్రజాప్రతినిధులకు  కనీస  గౌరవం  కూడా  లేకపోవడం ప్రశ్నలు  రేకెత్తిస్తోంది.

  • తెలంగాణలో సర్పంచ్‌‌‌‌‌‌‌‌కు న్యాయం ఎక్కడ?

తెలంగాణలో సుమారు 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో  దాదాపు ఆరు వేలమంది  మహిళా సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు ప్రజాప్రతినిధులుగా సేవలందిస్తున్నారు.  ప్రతి గ్రామ పంచాయతీ ఒక చిన్న ప్రభుత్వంలా పనిచేస్తోంది. గ్రామాభివృద్ధి,  పారిశుద్ధ్యం, తాగునీరు,  సంక్షేమ పథకాల అమలు,  ప్రజా సమస్యల పరిష్కారం అన్నింటికీ సర్పంచ్ కేంద్రబిందువు. కానీ ఆ బాధ్యతలకు తగిన గౌరవం ఉందా? అనేది ప్రశ్నార్థకం.  ప్రస్తుతం తెలంగాణలో సర్పంచ్‌‌‌‌‌‌‌‌కు నెలకు కేవలం రూ.6,500 గౌరవ వేతనం మాత్రమే ఉంది. 

 కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌‌‌‌‌‌‌‌లకు అది కూడా సకాలంలో అందడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.  నెలకు రూ.6,500 అంటే రోజుకు సుమారు రూ.216. గంటకు లెక్కిస్తే  పది రూపాయలలోపే.  ఒక గ్రామం మొత్తానికి బాధ్యత వహించే వ్యక్తి శ్రమను ఈ మొత్తంతో  కొలవడం సాధ్యమేనా?  లక్షల రూపాయల అభివృద్ధి పనులను పర్యవేక్షించే, కోట్ల రూపాయల  ప్రభుత్వ పథకాల అమలుకు బాధ్యత వహించే వ్యక్తికి ప్రభుత్వం ఇస్తున్న గౌరవం మాత్రం నామమాత్రం.  ఇది  గ్రామ నాయకత్వాన్ని వ్యవస్థ ఎంత తక్కువగా అంచనా వేస్తోందో  తెలియజేస్తోంది. 

  • ఇతర రాష్ట్రాలు చూపుతున్న దారి

దేశంలోని అనేక రాష్ట్రాలు స్థానిక ప్రజాప్రతినిధుల ప్రాముఖ్యతను గుర్తిస్తున్నాయి.  గోవాలో  సర్పంచ్‌‌‌‌‌‌‌‌లకు  నెలకు రూ.20,000 వరకు గౌరవ వేతనం అందుతోంది.  కేరళలో  రూ.15,000 వరకు, పంజాబ్‌‌‌‌‌‌‌‌లో  రూ.12,000-–15,000 వరకు,  హర్యానాలో  రూ.10,000కు పైగా వేతనాలు, అదనపు భత్యాలు అందిస్తున్నారు.  అయితే  తెలంగాణలో మాత్రం ఇంకా రూ.6,500 వద్దే నిలిచిపోయింది. గోవా వంటి చిన్న రాష్ట్రం తన సర్పంచ్‌‌‌‌‌‌‌‌కు రూ.20,000 ఇవ్వగలిగితే, నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణ ఎందుకు ఇవ్వలేకపోతోంది? ఇది వనరుల కొరత కాదు. రాజకీయ సంకల్పం కొరత. 

  • సంస్కరణలు అత్యవసరం

సర్పంచ్‌‌‌‌‌‌‌‌ల గౌరవ వేతనాన్ని తక్షణమే కనీసం రూ.15,000 నుంచి రూ.20,000కు పెంచాలి. ఐదేళ్ల సేవ పూర్తిచేసిన వారికి గౌరవప్రదమైన పెన్షన్ అమలు చేయాలి.  ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలి.   పంచాయతీలకు మరింత ఆర్థిక, పరిపాలనా స్వయంప్రతిపత్తి కల్పించాలి.  

సర్పంచ్‌‌‌‌‌‌‌‌లకు  డిజిటల్  గవర్నెన్స్, ఆర్థిక నిర్వహణ, చట్టపరమైన అంశాలపై  నిరంతర శిక్షణ అందించాలి.  అత్యంత ముఖ్యంగా, పంచాయతీరాజ్ వ్యవస్థను కేవలం పథకాల అమలు యంత్రాంగంగా కాకుండా ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా గుర్తించే రాజకీయ సంకల్పం అవసరం. సర్పంచ్‌‌‌‌‌‌‌‌ను బలపరచడం అంటే గ్రామ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం. 

  • అధికారాలు తక్కువ.. బాధ్యతలు ఎక్కువ!

పంచాయతీరాజ్ వ్యవస్థ ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య అధికారాల కేంద్రీకరణ.  అభివృద్ధి పనులు చేయాల్సింది సర్పంచ్.  ప్రజలకు సమాధానం చెప్పాల్సింది సర్పంచ్.  కానీ నిధుల విడుదల, పరిపాలనా అనుమతులు, సాంకేతిక ఆమోదాలు మాత్రం ఉన్నతాధికారుల చేతుల్లో ఉంటాయి.  ఫలితంగా  గ్రామంలో  సమస్య వస్తే  ప్రజలు  సర్పంచ్‌‌‌‌‌‌‌‌ను ప్రశ్నిస్తారు. కానీ పరిష్కారానికి అవసరమైన అధికారాలు చేతుల్లో ఉండవు. ఇది స్థానిక ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్న ప్రమాదకర ధోరణి.

- రేణుక గుంటిపల్లి
రాష్ట్ర అధ్యక్షురాలు, 
తెలంగాణ రాష్ట్ర మహిళా సర్పంచ్​ల ఫోరం

Note:  ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.