స్మార్ట్ సిటీల్లో తెలంగాణకు ఒక్క అవార్డూ రాలే

స్మార్ట్ సిటీల్లో తెలంగాణకు ఒక్క అవార్డూ రాలే

చెత్త నిర్వహణలో ఏపీకి పురస్కారం
2022 అవార్డు విన్నర్లనుప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ, వెలుగు : ఇండియన్  స్మార్ట్ సిటీ అవార్డుల్లో తెలంగాణ ఏ కేటగిరిలోనూ నిలువలేదు. శుక్రవారం కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ స్మార్ట్ సిటీ 2022 అవార్డు విన్నర్లను ప్రకటించింది. ఐదు విభాగాల్లో ఈ అవార్డుల కోసం దేశవ్యాప్తంగా 845 అప్లికేషన్లు రాగా వివిధ విభాగాల్లో పలు సిటీలు పోటీలో నిలువలేకపోయాయి. స్మార్ట్ సిటీస్  మిషన్ అపెక్స్  కమిటీ మొత్తం 66 నగరాలను అవార్డులకు ఎంపిక చేసింది. 

ఇందులో 35 ప్రాజెక్ట్ అవార్డులు, 6 ఇన్నొవేషన్ అవార్డులు, 13 నేషనల్/ జోనల్ సిటీ అవార్డులు, 5 కేంద్ర పాలిత ప్రాంత/రాష్ట్ర అవార్డులు, 7 భాగస్వామ్య అవార్డులను ప్రకటించింది. ఏపీకి చెందిన కాకినాడకు పారిశుద్ధ్య విభాగంలో సాలిడ్  వేస్ట్ మేనేజ్ మెంట్  సిస్టంలో అవార్డు దక్కింది. సెప్టెంబర్ 27 మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్ లో జరిగే వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేస్తారు. కాగా, ఇప్పటి వరకు స్మార్ట్ సిటీల్లో సత్తా చాటిన తెలంగాణ రాష్ట్రానికి ఒక్క అవార్డు కూడా రాకపోవడం గమనార్హం.