బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు : పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు

బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు : పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మద్దతు కీలకమైనదని, బీజేపీ లేకుండా తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు  పేర్కొన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో లీగల్ సెల్ ఆధ్వర్యంలో శనివారం రాంచందర్ రావుకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ పితామహుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ నేతలు, తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నప్పటికీ, తెలంగాణ కోసం బీజేపీ మద్దతివ్వడం కీలకమైన అంశమని   చెప్పారు.

 తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్​ను కలిసి చర్చించామని , ఆ తర్వాత  ప్రకాష్ జవదేకర్‌‌‌‌‌‌ను కలిశామని గుర్తుచేశారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో న్యాయపరంగా ఇబ్బందులు లేకుండా పాస్ చేసే ప్రక్రియలో న్యాయవాదుల పాత్ర ఎంతో కీలకమని, రాష్ట్ర సాధనలో న్యాయవాదుల పాత్రను మరువలేమని పేర్కొన్నారు. తెలంగాణను వికసిత రాష్ట్రంగా మార్చాలంటే అది కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.