
న్యూఢిల్లీ: తన వీడియో స్ట్రీమింగ్ సర్వీస్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ 20 లక్షల మంది పెయిడ్ సబ్‌స్క్రయిబర్ మార్క్‌ను సాధించిందని టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఈ ఓటీటీ అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్ మొబైల్, లార్జ్ స్క్రీన్ ఫార్మాట్‌లలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల బొకేను అందిస్తుంది. భారీ కస్టమర్లతో భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఓటీటీ అగ్రిగేటర్‌గా ఎదిగామని ఎయిర్‌టెల్ డిజిటల్ సీఈఓ ఆదర్శ్ నాయర్ చెప్పారు. ఇరోస్ నౌ, సోనీ లివ్, లయన్‌గేట్, హోయ్‌చోయ్, మనోరమా మ్యాక్స్, షెమారూ, అల్ట్రా, హంగామా ప్లే, ఎపికాన్, డాక్యుబే, డివోటీవీ వంటి 15 ఓటీటీ సేవలు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇటీవల చౌపాల్ టీవీ, కంచ లంక అనే మరో రెండు ఓటీటీలతోనూ ఒప్పందం కుదుర్చుకోవడంతో తమ సేవలను పంజాబీ, భోజ్‌పురి, ఒడియా మాట్లాడేవారికీ అందించగలుగుతున్నామని నాయర్ చెప్పారు. ఎయిర్‌టెల్ ఎక్స్ట్రీమ్ ఎన్నో ఓటీటీలను ఒకే లాగిన్, ఒకే సబ్‌స్క్రిప్షన్ ధరతో అందుబాటులోకి తీసుకువస్తుందని ఆయన వివరించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో రిపీట్ రీఛార్జ్‌లు/సబ్‌స్క్రిప్షన్‌ల ద్వారా భారీ ఆదరణ దక్కిందని కంపెనీ తెలిపింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌లో యావరేజ్ వ్యూయర్షిప్ టైం 150 నిమిషాల వరకు ఉంది. ఎక్కువ మంది సోనీ లివ్, హంగామా, ఇరోస్ నౌ, లయన్స్ గేట్ ప్లే ప్లాట్‌ఫారమ్‌లో కంటెంట్ చూస్తున్నారని వెల్లడించింది. మొబైల్ సబ్‌స్క్రయిబర్లు కనీసం రూ. 148 రీఛార్జ్‌తో ఏదో ఒక ఓటీటీ ప్రొవైడర్‌ని ఎంచుకోవచ్చు. భారతీయ ఓటీటీ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటి. మనదేశంలో దాదాపు 40 ఓటీటీలు ఉన్నాయి.