టెలికాం ప్యాకేజీకి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌

టెలికాం ప్యాకేజీకి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌

న్యూఢిల్లీ: టెలికాం ప్యాకేజీకి కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఇవాళ జరిగిన కేబినెట్‌ భేటీలో టెలికాం రంగానికి కేంద్రం ఊరటకలిగించింది. టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఏజీఆర్‌ వాయిదా మొత్తం చెల్లించకుండా నాలుగేళ్ళ పాటు మారటోరియం విధించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆటో రంగానికి ప్రొడక్షన్‌ లింక్డ్‌ స్కీమ్‌ (పీఎల్‌ఐ)కు కూడా కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. దాదాపు 26వేల కోట్లను ఈ రంగానికి కేంద్రం ఇస్తుంది. 
వోడా ఫోన్ ఐడియా కంపెనీ సుమారు 50వేల కోట్లకుపైగా కేంద్రానికి ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉండగా.. ఆ కంపెనీ మాజీ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా తన వాటాను కేంద్రానికి ఇస్తానంటూ కేబినెట్ సెక్రటరీకి ఇటీవలే లేఖ రాశారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన భేటీలో అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగానికి చేయూతనిచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రం ఇవ్వనున్న ఈ ప్యాకేజీల పూర్తి వివరాలను కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌, సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడిరిస్తారు. మరోవైపు స్టాక్‌ మార్కెట్‌లో టెలికాం, ఆటో రంగానికి కంపెనీ షేర్లు లాభాలు పొందాయి.