బీజేపీ నేతలు తెలంగాణకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలె : నిరంజన్‌ రెడ్డి

బీజేపీ నేతలు తెలంగాణకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలె : నిరంజన్‌ రెడ్డి

 కేసీఆర్​పై తప్పుడు ఆరోపణలు చేసి ఓట్లు పొందలేరు 

హైదరాబాద్, వెలుగు: గత పదేండ్లలో తెలంగాణకు ఏంచేశారో చెప్పి.. బీజేపీ నేతలు ఓట్లు అడగాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్​ చేశారు. కేసీఆర్ పై  పదేండ్లుగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా అనేక ఆరోపణలు చేశారని.. కానీ, అందులో ఒక్కటి కూడా నిరూపించకలేకపోయారని ఆయన అన్నారు. తప్పుడు ఆరోపణలు చేసి ఓట్లు పొందలేరని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో నిరంజన్‌రెడ్డి బుధవారం మాట్లాడారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ ఉనికే లేదని, సమీప భవిష్యత్ లో కూడా కీలకంగా వ్యవహరించే పరిస్థితి ఉండదన్నారు. 

లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ స్థానాలకే ఆ పార్టీ పరిమితం అవుతుందన్నారు. బీఆర్ఎస్ నేతలనే పార్టీలో చేర్చుకుని అభ్యర్థులుగా ప్రకటించుకునే దుస్థితిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ అంత బలంగా ఉంటే తమ పార్టీ నుంచి నాయకులను తీసుకోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ నుంచి వెళ్తున్న నాయకులకు ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన వ్యాఖ్యానించారు. 

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న కాంగ్రెస్ నినాదం హాస్యాస్పదంగా ఉందన్నారు. కోటిమందిని కోటీశ్వరులను చేయడం సంగతి పక్కనబెట్టి, ప్రజలను బిచ్చగాళ్లుగా మారకుండా చూడాలని ప్రభుత్వానికి నిరంజన్‌రెడ్డి సూచించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, మన్నె గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.