తెల్లాపూర్ సమస్యలను పరిష్కరించండి : నైబర్ హుడ్ అసోసియేషన్ ప్రతినిధులు

తెల్లాపూర్ సమస్యలను పరిష్కరించండి : నైబర్ హుడ్ అసోసియేషన్ ప్రతినిధులు
  •     మంత్రి పొన్నంను కోరిన  గెటెడ్ కమ్యూనిటీల ప్రతినిధులు

రామచంద్రాపురం, వెలుగు: ఇటీవల జీహెచ్ఎంసీలో విలీనమైన తెల్లాపూర్​లో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని తెల్లాపూర్​ నైబర్​ హుడ్​ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం అసోసియేషన్​ ఆధ్వర్యంలో మంత్రి, జీహెచ్ఎంసీ ఇన్​చార్జి పొన్నం ప్రభాకర్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా ప్రెసిడెంట్ ఈశ్వరిగారి రమణ మాట్లాడుతూ.. తెల్లాపూర్​లో ప్రస్తుతం క్యాపిటల్ వాల్యూ ఆధారంగా 200 శాతం అదనంగా  ప్రాపర్టీ ట్యాక్స్​లను చెల్లిస్తున్నామని వెంటనే రెంటల్ వాల్యూ విభాగంలోకి మార్చాలని కోరారు. రేడియల్​ రోడ్డు 30 పూర్తి కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇంటర్నల్​ రోడ్లు కూడా ఏళ్ల తరబడి పెండింగ్​లో ఉన్నాయని తెలిపారు. 

వందల సంఖ్యలో ఉన్న గేటేడ్​ కమ్యూనిటీలకు ఒక్క ఎస్టీపీ వ్యవస్థ లేదని దీనివల్ల నిత్యం డ్రైనేజీ సమస్యలు వస్తున్నాయని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 20 వేల లీటర్ల  ఫ్రీ వాటర్​ సరఫరాను తెల్లాపూర్​కు వర్తింపజేయాలని కోరారు. తెల్లాపూర్​ సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించి జీహెచ్ఎంసీ కమిషనర్​కు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో వివిధ మున్సిపాలిటీల ప్రతినిధులు, అసోసియేషన్​ సభ్యులు ఉన్నారు.