లిటిల్ హార్ట్స్, అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్, హే బలవంత్ చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న తెలుగమ్మాయి శివానీ నాగరం.. ఇప్పుడు కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. తమిళ చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’తో దర్శకుడిగా మెప్పించిన అభిషన్ జీవింత్.. ఆ తర్వాత ‘విత్ లవ్’ చిత్రంతో హీరోగానూ ఇంప్రెస్ చేశాడు. ఈ రెండు చిత్రాలు తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తాజాగా అతను హీరోగా మరో కొత్త సినిమా మొదలైంది. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. శివానీ నాగరం ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. యోగలక్ష్మి మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’కి వర్క్ చేసిన గౌతమ్ శివరామన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. డ్రామా కంపెనీ అనే కొత్త నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. ఫాదర్ అండ్ సన్ రిలేషన్ నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ డ్రామాలో శివరాజ్ కుమార్ తండ్రి పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్నేళ్ల విరామం తర్వాత ఆయన తిరిగి ఈ జానర్‌లో నటిస్తుండటం విశేషం.
