
టాలీవుడ్‌లో డ్యాన్సర్ల కొరత ఉందని, టాలెంట్ ఉన్న డ్యాన్సర్స్ అందరూ ఆడిషన్స్ ఇవ్వాలని తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్ అసోసియేషన్ కోరింది. ఆ వివరాలను తెలియజేసేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో ఫిల్మ్ చాంబర్‌లో ఆడిషన్స్ నిర్వహించబోతున్నామని, సెలెక్ట్ అయిన డ్యాన్సర్లకు కొత్తగా మెంబర్ షిప్ ఇవ్వబోతున్నట్టు యూనియన్ సభ్యులు చెప్పారు.
అసోసియేషన్ అధ్యక్షుడు హెచ్.చంద్రశేఖర్ మాట్లాడుతూ ‘అసోసియేషన్‌లో 130 మంది మాస్టర్లు, 500 మంది డ్యాన్సర్స్ సభ్యులుగా ఉన్నారు. మూడు రోజుల పాటు ఆడిషన్స్ నిర్వహిస్తున్నాం. అందరూ సద్వినియోగం చేసుకోవాలి’ అని చెప్పారు. లేడీ డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లు ఇండస్ట్రీకి కావాలని.. ఎలాంటి భయాలు లేకుండా అమ్మాయిలు ఆడిషన్‌కు హాజరు కావాలని యానీ మాస్టర్ కోరారు.
తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్, అసోసియేషన్ ఫౌండర్ సోమరాజు, డ్యాన్స్ మాస్టర్స్ సత్య, పాల్, ప్రకాష్, శ్రీధర్ రెడ్డి, భాను, యశ్ తదితరులు పాల్గొన్నారు.