
టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ తమకు 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ షూటింగ్ బంద్ చేసిన నేపథ్యంలో.. సోమవారం ఫిల్మ్ చాంబర్ ఓ నోట్ విడుదల చేసింది. ‘తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఇప్పటికే చాలా ఇబ్బందికర పరిస్థితులలో ఉంది. ఇలాంటి సమయంలో వేతనాలు పెంచడం, అందులోనూ కార్మిక శాఖ కమీషనర్ మార్గదర్శకత్వంలో, సామరస్యపూర్వక పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్న సందర్భంలో ఫెడరేషన్ వారు లేబర్ కమీషనర్ గారి మాటను ధిక్కరిస్తూ షూటింగ్ నిలిపివేత నిర్ణయం తీసుకోవడం బాధాకరం.
చిన్న నిర్మాతలు భరించలేని స్థాయిలో వేతనాలు పెంపును యూనియన్స్ డిమాండ్ చేయటం చిన్న నిర్మాతలకు ఆమోదయోగ్యం కాదు. నైపుణ్యం కలిగి సభ్యత్వం లేని కార్మికులు అయినప్పటికీ వాళ్లతో షూటింగ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ మనుగడ, నిర్మాతల శ్రేయస్సు ముఖ్యమని కార్మిక సంఘాలు గుర్తించాలి’ అని ఫిల్మ్ చాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు.