తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న రాజకీయ వేడికి తెరపడింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఎన్నికల నిర్వహణపై చెలరేగిన రెండు వర్గాల వివాదానికి తెరదించుతూ.. 2025-27 నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో తెలుగు సినిమా పెద్దల మధ్య ఆధిపత్య పోరుకు రంగం సిద్ధమైంది.
ఢీ అంటే ఢీ
ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు వెంటనే జరపాలని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లలకు చెందిన ఒక వర్గం, ప్రస్తుత కార్యవర్గాన్నే మరికొంత కాలం కొనసాగించాలని మరో వర్గం పట్టుబట్టడంతో వివాదం తారస్థాయికి చేరింది. అయితే, ఛాంబర్ బైలాస్ ప్రకారం ఎన్నికలు నిర్వహించక తప్పదని తేలడంతో, నవంబర్ 16న జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో డిసెంబర్ నెల తెలుగు సినీ రాజకీయాలకు అడ్డాగా మారబోతోంది.
ఎప్పుడు ఏం జరగబోతోంది?
నవంబర్ 25న విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం, ఎన్నికల పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పంపిణీ డిసెంబర్ 1, 2025 నుంచి ప్రారంభం కానుంది. ఈ నామినేషన్ పత్రాలు హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, విశాఖపట్నం, తిరుపతి కార్యాలయాలలో అందుబాటులో ఉంటాయి. నామినేషన్ల సమర్పణ గడువు డిసెంబర్ 12 కాగా ఉపసంహరణకు డిసెంబర్ 19న చివరి తేది. నామినేషన్ల పరిశీలన తర్వాత డిసెంబర్ 20న తుది అభ్యుర్థుల జాబితాను ప్రకటిస్తారు. పోలింగ్ తేదీని డిసెంబర్ 28న ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫిల్మ్ ఛాంబర్ లో నిర్వహిస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు విజేతలను ప్రకటించనున్నారు.
ఎట్టకేలకు ఎన్నికల ప్రక్రియ మొదలవడం పట్ల సినీ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికలలో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యులతో పాటు, ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ , స్టూడియో సెక్టార్స్‌తో కూడిన నాలుగు విభాగాల కార్యనిర్వాహక సభ్యులను కూడా ఎన్నుకుంటారు. తెలుగు సినిమా భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక నిర్ణయాలు తీసుకునే ఈ ఛాంబర్‌కు ఎవరు అధ్యక్షత వహిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
