మానస సరోవర్ లో చిక్కుకున్న 40 మంది హైదరాబాదీలు

మానస సరోవర్ లో చిక్కుకున్న 40 మంది హైదరాబాదీలు

మానస సరోవర్ యాత్రకు తీసుకెళ్లి.. 40 మంది తెలుగు టూరిస్టులను చైనా బోర్డర్ లో వదిలేసింది సదరన్ ట్రావెల్స్. దీంతో.. 4 రోజులు వాళ్లంతా అక్కడే ఉండి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు ఇప్పుడు నేపాల్ చేరుకున్నారు. తమకు సాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. మదన్ గౌడ్ అనే వ్యక్తి సెల్ ఫోన్ లో వీడియో తీసి ఫ్రెండ్స్ కు, బంధువులకు వాట్సాప్ చేయడంతో.. సదరన్ ట్రావెల్స్ నిర్వాకం బయటపడింది.

ఈ నెల 13న హైదరాబాద్ కుత్బుల్లాపూర్ కు చెందిన కార్మిక నాయకుడు మదన్ గౌడ్ సహా..  40 మంది సదరన్ ట్రావెల్స్ లో మానస సరోవర్ యాత్రకు వెళ్లారు . అయితే, మానస సరోవరాన్ని చూపించిన ట్రావెల్స్ సిబ్బంది.. వారిని చైనా సరిహద్దుల్లోని నిస్సా  దగ్గర వదిలేసి వెళ్లారు. దీంతో.. 4 రోజులు ట్రావెల్స్ వారి కోసం ఎదురుచూసి విసిగిపోయారు టూరిస్టులు. ఈ 4 రోజులు.. చిన్నగుడిసెల్లో ఉన్నామని.. ఆడవాళ్లు కూడా చాలా ఇబ్బందులు పడ్డారని వాపోయారు. ఆక్సిజన్ కూడా సరిగ్గా అందలేదని తెలిపారు.

హైదరాబాద్  నుంచి మాసన సరోవర్ యాత్రకు తీసుకెళ్లి.. తిరిగి తీసుకొచ్చేలా టూరిస్టులతో ప్యాకేజ్ మాట్లాడుకుంది సదరన్ ట్రావెల్స్. కానీ.. 4 రోజుల క్రితం చైనా బోర్డర్లో తెలుగు టూరిస్టులను వదిలేసి వెళ్లిపోయారు ట్రావెల్స్ సిబ్బంది. దీంతో.. కొండ ప్రాంతాల్లో, ఎలాంటి సౌకర్యాలు లేని చోట తెలుగువాళ్లు ఇబ్బందులు పడ్డారు. ఐతే.. ఎట్టకేలకు అక్కడి నుంచి నేపాల్ చేరుకున్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమను ఇక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు.