మధిర, వెలుగు : సీతారామాంజనేయ కళాపరిషత్ మాటూరుపేట ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ర్టాల్లో ప్రాచీన కళలను ప్రోత్సహించడం అభినందనీయమని లక్ష్మీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణ మండపం అధ్యక్షుడు పుల్లారావు అన్నారు. మధిర బంజారా కాలనీ వేంకటేశ్వరస్వామి కల్యాణ మండపంలో గురువారం తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఏకపాత్రాభినయం, పౌరాణిక నాటికల పోటీలు నిర్వహించారు.
ఈ పోటీల్లో పాల్గొన్న కళాకారులకు మెమోంటో, ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనేకమంది మధిర ప్రాంత కళాకారులు తమ నటన ద్వారా జాతీయస్థాయిలో అనేక అవార్డులు పొందారని తెలిపారు. కళామతల్లి ముద్దుబిడ్డలైన మధిర కళాకారులు దేశవ్యాప్తంగా అనేక నాటక ప్రదర్శనలు చేసి బహుమతులు పొందారని గుర్తుచేశారు.
కళలను ఆదరించేందుకు మాటూరుపేట సీతారామాంజనేయ కళాపరిషత్ వ్యవస్థాపకుడు గడ్డం సుబ్బారావు చేస్తున్న కృషి అభినందించారు. కార్యక్రమంలో మధిర రంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షుడు శ్రీకృష్ణ ప్రసాద్, సీతారామాంజనేయ కళాపరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు గడ్డం సుబ్బారావు, గడ్డం రమేశ్, నాయకులు పాల్గొన్నారు.
