తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక... నాలుగు రోజులు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక... నాలుగు రోజులు భారీ వర్షాలు

తెలంగాణ వాతావరణ శాఖాధికారులు హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్​ 28 నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.  దక్షిణ అండమాన్‌ సమీపంలోని బంగాళాఖాతంలో మలక్కా జలసంధిలో సోమవారం ( నవంబర్​ 27) అల్పపీడనం ఏర్పడింది.  ఇది రేపు ( నవంబర్​29) పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో  తుపానుగా మారనుంది.  దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు ( నవంబర్​ 28 నుంచి)  తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. 

ముఖ్యంగా భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సిరిసిల్ల, జనగాం, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ఉదయం పూట పొగమంచు, మంచు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 21 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశలో గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. 

 వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ బంగ్లాదేశ్‌, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.ఇక  ఏపీలోని అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని దిగువ ట్రోపోస్పియర్‌లో తూర్పుగాలులు వీస్తున్నాయని తెలిపారు. వీటి ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.