రాష్ట్రంలో పడిపోయిన టెంపరేచర్​.. రాత్రి, పగలు చలిగాలులు

రాష్ట్రంలో పడిపోయిన టెంపరేచర్​.. రాత్రి, పగలు చలిగాలులు

హైదరాబాద్/కామారెడ్డి/ జీడిమెట్ల, వెలుగు: రాష్ట్రంలో నాలుగైదు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. జనం గజ గజ వణుకుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. మధ్యాహ్నం కూడా ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో జనం ఇల్లు విడిచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఉదయం పది గంటల వరకు కూడా పొగ మంచు వీడటం లేదు. మరో ఐదు రోజుల వరకూ అంటే సంక్రాంతి వరకు చలి ఇట్లనే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కామారెడ్డి, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్, నిర్మల్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్‌‌, సిరిసిల్ల, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం ఆరెంజ్ అలర్ట్ కొనసాగింది. ఈ జిల్లాల్లో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం కామారెడ్డి జిల్లా డొంగ్లీలో అత్యల్పంగా 5.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  

ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6 డిగ్రీలు, మెనూర్​లో 6.8 డిగ్రీలు, కామారెడ్డిలో 7.6 డిగ్రీలు, రాంలక్ష్మణ్​​పల్లిలో 7.7 డిగ్రీలు, మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8 డిగ్రీలు, జుక్కల్​లో 8.1 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో మంగళవారం కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, బుధవారం నుంచి చలికొంత తగ్గి, 10 నుంచి 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే స్థాయిలో టెంపరేచర్ ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. 

ఈ ఏడాది ఇదే రికార్డు

గ్రేటర్​ హైదరాబాద్​లో ఈ నెల 6న ఉదయం పలుచోట్ల పొగమంచు, మబ్బులు కమ్ముకోవడంతోపాటు వర్షం కురిసింది. అప్పటి నుంచి చలి తీవ్రత పెరిగింది.  సోమవారం ఈ సంవత్సరంలో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యల్పంగా ఆదిలాబాద్​లో  6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా..  హైదరాబాద్​లో 11.3గా నమోదైంది.  ఈ నెల 6న వాతావారణం మారిపోవడంతో ఆ తర్వాత ఐదు రోజుల్లో  రాష్ట్రంలో 10 డిగ్రీలు, గ్రేటర్​హైదరాబాద్​లో 15 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతవారణ శాఖ అంచనా వేసింది. అయితే.. ఇందుకు భిన్నంగా ఒక్కసారిగా  సోమవారం ఆదిలాబాద్​లో 6,  హైదరాబాద్​లో 11.3 డిగ్రీలకు రికార్డు స్థాయిలో టెంపరేచర్​ పడిపోయింది. 

జాగ్రత్తలు పాటించాలి

చలి పెరగడంతో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు, వృద్ధులతోపాటు ఆస్తమా, సీవోపీడీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.