ఆదిలాబాద్ లో చలి పంజా..9 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్

ఆదిలాబాద్ లో చలి పంజా..9 డిగ్రీలకు పడిపోయిన  టెంపరేచర్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ఇళ్ల నుంచి జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. తాజాగా జిల్లాలో పలుచోట్లు కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీలు నమోదవుతున్నాయి. దీంతో అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రానున్నరోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నట్లు వాతవరణ శాఖ హెచ్చరిస్తోంది.

ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులతో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. శీతల గాలులతో వృద్ధులు , చిన్నారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. డిసెంబర్ మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. 3 రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలతో జనం, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 

 వారం రోజులుగా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపే నమోదవుతున్నాయి. తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా గతంలో ఉష్ణోగ్రతలు 16 నుంచి 18 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఈనెల 13న ఆసిఫాబాద్ లో ఉష్ణోగ్రత 10.5 డిగ్రీలుగా నమోదైంది. అయితే ఐదు రోజులు నుంచి మరింత పడిపోయింది టెంపరేచర్. 12 నుంచి 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

చలి, దట్టమైన పొగమంచుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలు ...కశ్మీర్ ప్రాంతాన్ని  తలపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ లో ఏటా 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు  ఉంటున్నాయని అని చెప్తున్నారు స్థానికులు. ఇటీవల వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు  జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. 

 భిన్న వాతవరణ పరిస్థితులు, పొరుగు రాష్ట్రాల నుంచి బలమైన గాలులతో చలితీవ్రత పెరిగినట్లు అంచనా వేస్తున్నారు వెదర్ ఆఫీసర్లు.  చలిగాలులతో ఉదయం 9 గంటలైనా జనం రోడ్లపైకి రావటంలేదు. శీతల వాతావరణంతో వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. ముందు జాగ్రత్తగా జిల్లా వాసులు అలర్ట్ గా ఉండాలని ప్రభుత్వం సూచింది.