- మార్చి మొదటివారంలో ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు
- గత 50 ఏండ్లలో అత్యధికం
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఎండలు దంచికొడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రతలు 35.7 డిగ్రీలు నమోదైంది. గడిచిన 50 ఏండ్లలో మార్చి మొదటి వారంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని భారత వాతావరణ శాఖ అధికారి తెలిపారు. 1999లో మార్చి మొదటివారంలో నమోదైన 34.8 డిగ్రీలే ఇప్పటివరకు అత్యధికం కాగా ఇప్పుడు ఆ రికార్డు బద్ధలైంది.
ఢిల్లీ సఫ్దర్‌జంగ్ వాతావరణ కేంద్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 7.3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. హర్యానా వ్యాప్తంగా సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6.2 డిగ్రీలు ఎక్కువగా ఉంది. ఇక ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో గత రెండు మూడు రోజుల్లోనే 12 డిగ్రీల నుంచి 17.8 డిగ్రీలకు చేరడం ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది. హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్ లోనూ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
