- నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యధికంగా 44.5 డిగ్రీలు రికార్డ్
- ఇయ్యాల కూడా పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం
- ఇవ్వాల్టి నుంచి ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం శనివారం ఎండలతో మండిపోయింది. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అన్ని జిల్లాల్లోనూ వడగాలుల ప్రభావం తీవ్రంగా కనిపించింది. 11 జిల్లాల్లో టెంపరేచర్లు 44 డిగ్రీల సెల్సియస్కుపైగానే నమోదయ్యాయి. 13 జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా, 8 జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు నమోదు కాగా.. హైదరాబాద్‌లో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడు, సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్, నల్గొండ జిల్లా నాంపల్లిలో అత్యధికంగా 44.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబాబాద్(మరిపెడ), ములుగు (మేడారం), మంచిర్యాల (హాజీపూర్), కుమ్రంభీం ఆసిఫాబాద్(ఎల్కపల్లి)లో 44.4, ఖమ్మం (ముదిగొండ), వనపర్తి (కన్నయ్యపల్లి) 44.3, జగిత్యాల (కోల్వాయి) 44.1, కరీంనగర్(వీణవంక) 44 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదయ్యాయి. సిద్దిపేట, జయశంకర్భూపాలపల్లిలో 43.9, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, యాదాద్రిలో 43.8, జోగులాంబ గద్వాల, జనగామలో 43.7, వరంగల్, నిర్మల్‌లో 43.6, హనుమకొండ 43.5, నాగర్‌కర్నూల్43.3, మహబూబ్‌నగర్, మెదక్ 43.2, రంగారెడ్డి, నిజామాబాద్‌లో 42.8, వికారాబాద్ 42.7, మేడ్చల్ మల్కాజిగిరి (మేడిపల్లి), నారాయణపేటలో 42.6, ఆదిలాబాద్ 42.4, సంగారెడ్డి 42.5, కామారెడ్డి 42.1 లో 41.8 డిగ్రీల చొప్పున రికార్డ్ అయ్యాయి.
ఇయ్యాల కూడా వడగాలుల ప్రభావం
ఆదివారం కూడా హీట్‌వేవ్స్ ముప్పు పొంచి ఉన్నదని వాతావరణ శాఖ బులెటిన్‌లో హెచ్చరించింది. దక్షిణాదిన ఎండల తీవ్రత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.
ఐదారు జిల్లాల్లో అత్యధిక టెంపరేచర్లు
ఐదారు జిల్లాల్లో టెంపరేచర్లు తీవ్రంగా నమోదయ్యాయి. ఆయా జిల్లాల్లోని దాదాపు అన్ని మండలాల్లోనూ ఆరెంజ్ అలర్ట్‌కు మించి టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, ములుగు, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని అన్ని మండలాలు ఎండలతో మండిపోయాయి. నల్గొండ జిల్లాలోని 30 మండలాలు, సూర్యాపేటలోని 18 మండలాలు, భద్రాద్రిలోని 19 మండలాలు, ఖమ్మంలోని 18, మంచిర్యాలలోని 11 మండలాలు, పెద్దపల్లి జిల్లాలోని 10 మండలాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు మించి రికార్డ్ అయ్యాయి.