హైదరాబాద్, వెలుగు: హార్టీకల్చర్ వర్సిటీ వివాదాలకు కేంద్రంగా మారుతున్నది. ఇప్పటికే వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లోకి ఎక్కిన ఈ వర్సిటీలో.. ఇటీవల రూల్స్‌కు విరుద్ధంగా టెంపరరీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కారు అనుమతి లేకుండా నలుగురు టీచింగ్ ఫ్యాకల్టీని, ముగ్గురు నాన్ టీచింగ్ స్టాఫ్‌ను రెగ్యులరైజ్ చేయడం విమర్శలకు కారణమైంది. తాత్కాలిక ప్రాతిపదికన నియమించిన నాన్ టీచింగ్, టీచింగ్ స్టాఫ్‌ను రెగ్యులరైజ్ చేయడాన్ని ఆడిట్ అధికారులు తప్పు పట్టినట్లు తెలుస్తోంది. వర్సిటీ వీసీ పదవీ కాలం ముగిసే టైంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి14న వీసీ పదవీ కాలం ముగిసినా ఇన్చార్జిగా ఆమె ఇంకా అదే పదవిలో కొనసాగుతున్నారు. అలాగే, ఈ నియామకాల వెనక గత ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అసలేం జరిగిందంటే..
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐకార్ (ఐసీఏఆర్) ప్రాజెక్ట్ క్రిషి విజ్ఞాన కేంద్ర కో ఆర్డినేటర్ పరిధిలో 2022లో టీచింగ్ ఫ్యాకల్టీని సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ (ఎస్‌ఎంఎస్) పేరుతో తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. ఐదేండ్ల కాలపరిమితి లేదా కేవీకే ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు ఏది ముందైతే అది వర్తించేలా నియామకాలు చేపట్టారు. 2024 జనవరి 5న పెద్దపల్లి జిల్లా రామగిరి ఖిల్లాలోని కేవీకే కో ఆర్డినేటర్ కు కొత్తగా నియామకమై ఆరు నెలలు సర్వీసున్న సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ (ఎస్‌ఎంఎస్)ల వివరాలు, సర్వీస్ రిజిస్టర్ పంపించాలని హార్టీకల్చర్ వర్సిటీ రిజిస్ట్రార్ నుంచి ఆదేశాలందాయి. దీంతో అక్కడి కేవీకేలో పనిచేస్తున్న నలుగురు ఫ్యాకల్టీ వివరాలు పంపించారు. వీరిని జనవరి 12న రెగ్యులరైజ్ చేశారు.
నాన్ టీచింగ్ స్టాఫ్ అయిన ఫామ్ మేనేజర్, ల్యాబ్ టెక్నీషియన్, స్టెనోలను కూడా రెగ్యులరైజ్ చేశారు. వీరంతా షరతులతో తాత్కాలిక పద్ధతిలో నియామకమైనవారే. కనీసం కాంట్రాక్టు పద్ధతిలో కూడా నియామకం కాలేదు. రూల్స్ ప్రకారం రెగ్యులర్ బేసిస్ పై రిక్రూట్ అయినా.. కనీసం రెండేండ్ల ప్రొబెషనరీ పీరియడ్పూర్తయిన వారినే రెగ్యులరైజ్ చేయాలని నిబంధనలు చెప్తున్నాయి. కానీ, కేవీకే కోసం హార్టీకల్చర్ వర్సిటీ ద్వారా టెంపరరీ బేసిస్‌పై నియమితులైన వారిని కనీస నిబంధనలు పట్టించుకోకుండా రెగ్యులరైజ్ చేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
