పల్లెల్లో ప్రలోభాల జోరు.. గ్రామాల్లో ఊపందుకున్న ప్రచారం

పల్లెల్లో ప్రలోభాల జోరు..  గ్రామాల్లో ఊపందుకున్న ప్రచారం

నాగర్​కర్నూల్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత ప్రచారం జోరుగా సాగుతోంది. సర్పంచ్​ పదవి దక్కించుకోవాలనే పంతంతో ఎంతైనా ఖర్చు పెట్టడానికి అభ్యర్థులు వెనకడుగు వేయడం లేదు. పొద్దున ఒక రౌండ్​ ర్యాలీలో పాల్గొని ప్రచారం నిర్వహిస్తున్న గ్రామీణ ప్రాంతవాసులు, ఆ తరువాత కూలీ పనులకు పోతున్నారు. సాయంత్రం రాగానే మళ్లీ ఓ రౌండ్​ ప్రచారంలో పాల్గొంటున్నారు. సాయంత్రం మందు పోయించి చేతిలో రూ.500 పెడుతున్నారు. 

మరి కొన్ని గ్రామాల్లో సర్పంచ్​ అభ్యర్థులు పొద్దటి నుంచే టిఫిన్లు, బిర్యానీలు తయారు చేయిస్తున్నారు. పోటాపోటీగా నడుస్తున్న దావత్​లతో పల్లె జనం ఖుషీ అవుతున్నారు. ఇక ఎక్కువ ఓట్లు ఉన్న ఇంటి వాళ్లకు మస్తు ఇజ్జత్​ దొరుకుతోంది. జనరల్​ స్థానాలకు తీసిపోని విధంగా రిజర్వ్​ స్థానాల్లోనూ దావత్​లు నడుస్తున్నాయి. వీటితో పాటు గ్రామాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు, జెండాలు, పాటల హడావుడి పెరిగిపోయింది. 

ప్రైవేట్​ ఏజెన్సీలతో సర్వేలు..

కాంగ్రెస్  ఎమ్మెల్యేలు సర్పంచ్​ అభ్యర్థుల ఎంపిక, రెబెల్స్​ బుజ్జగింపులు మొదలుకుని నామినేషన్లలోనూ పాల్గొన్నారు. ప్రైవేట్​ ఏజెన్సీలతో   సర్వే చేయించి, రిపోర్టులను సర్పంచ్​ అభ్యర్థులకు పంపించి వారిని అలర్ట్  చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లలో వచ్చిన ఓట్ల శాతాన్ని పరిగణలోకి తీసుకుంటూ, సాధించాల్సిన ఓట్లను లెక్కలు కట్టి మరీ చెబుతున్నారు. ‘నీ పరిస్థితి బాగుంది. కొంచెం కష్టపడు మంచి మెజార్టీ వస్తుంది’ అని కొందరికి, ‘నీ పరిస్థితి బాగాలేదు. బాగా కష్టపడాలే’ అంటూ మరికొందరిని హెచ్చరిస్తున్నారు. 

ఎమ్మెల్యేల సర్వేలతో సర్పంచ్  బరిలో ఉన్న కాంగ్రెస్  మద్దతుదారులు అలర్ట్​ అవుతున్నారు. ఇదిలాఉంటే కాంగ్రెస్​కు చాలా గ్రామాల్లో రెబల్​ పంచాయితీ ఉంది. ఎమ్మెల్యేలు, గ్రామ నాయకులు ఓకే చేసిన అభ్యర్థులతో పాటు రెబెల్స్​ కూడా​కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల ఫొటోలు ఉన్న కండువాలు వేసుకొని ప్రచారం చేస్తున్నారు. వీరిలో ఎవరు గెలిచినా తమ పార్టీ వారే అన్న ధీమాతో నాయకులు లైట్​గా తీసుకుంటున్నారు.

ప్రతిపక్షాల క్యాండిడేట్లకు మద్దతు కరువు..

బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారుల పరిస్థితి అధ్వానంగా ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్  ఎలక్షన్లలో పార్టీని గెలిపించుకునేందుకు కష్టపడిన గ్రామీణ ప్రాంత నేతలకు ప్రధాన నాయకుల మద్దతు కరువైంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారికి మద్దతిచ్చేందుకు ఆయా పార్టీల అగ్రనాయకులు ముందుకు రావడం లేదు.​ చాలా గ్రామాల్లో బీజేపీ, బీఆర్ఎస్​ నాయకులు అండర్  స్టాడింగ్​తో వార్డులు పంచుకొని కలిసి పోటీ చేస్తున్నారు. దీంతో అధికార పార్టీకి  చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులు, ఇతర నాయకుల ప్రమేయం లేకుండానే కాంగ్రెస్​కు అనుకూల వాతావరణం ఏర్పాడుతోంది. కొన్ని గ్రామాల్లో ప్రజలు ఏకపక్షంగా ఓట్లేస్తామని చెప్పడం కాంగ్రెస్​ నాయకులనే ఆశ్చర్యానికి  గురి చేస్తోంది.