
బీజింగ్: ఒక చిన్న ఇంటిని కట్టాలంటేనే కనీసం 3 నెలల టైం పడుతుంది. అలాంటిది పది అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే ఎన్ని రోజులు పట్టాలి!! కానీ, ఒక్కరోజులోనే కట్టారంటే నమ్ముతారా? నమ్మలేకపోయినా.. ఇది అక్షరాలా నిజం. ఆ అసాధ్యాన్ని సాధ్యంచేసి చూపించింది చైనాలోని చాంగ్షాకు చెందిన బ్రాడ్ గ్రూప్ అనే సంస్థ. టెక్నాలజీని వాడుకుని కేవలం 28 గంటల 45 నిమిషాల్లోనే పదంతస్తుల బిల్డింగ్‌ను నిలబెట్టింది. మామూలుగా అయితే, ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ పోతే ఆ బిల్డింగ్ కట్టడానికి ఏండ్లు పట్టేదే. ఇక్కడ మాత్రం ఆ సంస్థ.. ఇది వరకే ఫ్యాక్టరీలో తయారు చేసి పెట్టిన బ్లాకులను పేర్చుకుంటూ పోయిందంతే. అన్ని బ్లాకులను పేర్చి బిల్డింగ్‌గా మార్చేసిన తర్వాత.. వాటర్, కరెంట్ కనెక్షన్ ఇచ్చింది. ముందే తయారుచేసి పెట్టిన బ్లాకులకు బోల్టులను బిగిస్తే బిల్డింగ్ ఈజీగా ముస్తాబైపోతుందని సంస్థ పేర్కొంది.