మంత్రి సబిత క్యాంప్ ఆఫీసు ముట్టడి ఉద్రిక్తం

మంత్రి సబిత క్యాంప్ ఆఫీసు ముట్టడి ఉద్రిక్తం
  • బీజేపీ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట
  • చిరిగిన అందెల షర్ట్.. భుజానికి గాయం
  • మీర్ పేట జిల్లెలగూడ పరిధిలో ఘటన 

ఎల్​బీనగర్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మీర్ పేట్ జిల్లెలగూడలోని మంత్రి సబితా రెడ్డి క్యాంప్ ఆఫీసు వద్ద శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందుగా బీజేపీ మహేశ్వరం సెగ్మెంట్​ బీజేపీ ఇన్​చార్జి అందెల శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో భారీగా పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివెళ్లి మంత్రి క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. అప్పటికే మోహరించిన పోలీసులు బీజేపీ శ్రేణులను అడ్డుకోగా.. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. 

అందెల శ్రీరాములు యాదవ్ షర్ట్ చినిగిపోవడమే కాకుండా ఎడమ భుజానికి గాయమైంది. బీజేపీ కార్యకర్తలను పోలీసులు లాగి పడేశారు.  అనంతరం శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో హామీలు ఇస్తూ.. అర్హులకు ఇవ్వకుండా బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూరుస్తుందని ఆరోపించారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

 మంత్రి సబితా రెడ్డి ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు చేయించి  భయభ్రాంతులకు గురి చేయడం సిగ్గుచేటని విమర్శించారు. పోలీసుల దురుసు ప్రవర్తనతో గాయపడ్డ బడంగ్ పేట్​ మాజీ అధ్యక్షుడు నిమ్మల శ్రీకాంత్ గౌడ్, బీజేవైఎం అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, నేతలు అనిల్ గౌడ్, గౌతమ్ రెడ్డి సహా యువకులను అందెల శ్రీరాములు పరామర్శించారు.