బీఆర్ఎస్ భూకబ్జాదారుల్లో టెన్షన్ .. సర్కార్ ఎంక్వైరీతో దడ

బీఆర్ఎస్  భూకబ్జాదారుల్లో టెన్షన్ ..  సర్కార్ ఎంక్వైరీతో దడ

 

  • అక్రమాలకు సహకరించిన అధికారుల్లోనూ భయం
  • రాష్ట్రవ్యాప్తంగా రూ.8 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా అయినట్టు అంచనా
  • జీవో 59 కింద రెగ్యులరైజ్ చేసుకున్న భూములపైనా ప్రభుత్వం దృష్టి 


ప్రభుత్వ భూములు కాజేసిన ఆక్రమణదారుల్లో టెన్షన్ మొదలైంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన భూదందాపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీ చేయిస్తుండడంతో భూకబ్జాదారులు, వాళ్లకు సహకరించిన అధికారులకు భయం పట్టుకుంది. జీహెచ్ ఎంసీ పరిధిలో, జిల్లాల్లో ప్రభుత్వ భూములతో పాటు భూదాన్, శిఖం, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, ఇరిగేషన్, ఫారెస్ట్​ల్యాండ్స్ ఆక్రమణలు ఎక్కడెక్కడ జరిగాయనే దానిపై సర్కార్ వివరాలు సేకరిస్తోంది. దాదాపు రూ.8 లక్షల కోట్లకు పైగా విలువైన భూములు కబ్జాకు గురైనట్టు ప్రాథమికంగా అంచనా వేసింది. 


గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ భూదందాలో ఆ పార్టీ లీడర్లే ప్రధానంగా ఉన్నట్టు గుర్తించింది. జీహెచ్ఎంసీ పరిధిలో, జిల్లాల్లో ప్రభుత్వ భూములతో పాటు భూదాన్, శిఖం, వక్ఫ్, దేవాదాయ, పైగా, అసైన్డ్, కాందిశీకులకు చెందిన వేలాది ఎకరాలు కబ్జాకు గురైనట్టు.. అవి బీఆర్ఎస్ నేతల పేర్ల మీదకు మారినట్టు తెలుసుకుంది. కాగా, ప్రభుత్వం భూఆక్రమణల డేటా సేకరిస్తున్నదన్న విషయం తెలిసి కొందరు బీఆర్ఎస్ లీడర్లలో దడ మొదలైంది. ఆ లీడర్లకు సహకరించిన అధికారులు, దళారుల్లోనూ టెన్షన్ నెలకొంది. 

ప్రభుత్వ ఎంక్వైరీపై నేతల ఆరా.. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లోని లొసుగులను ఆసరాగా చేసుకుని ఆ పార్టీ లీడర్లు భూఆక్రమణలకు పాల్పడ్డారు. ఈ భూదందాపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీమ్ రిపోర్టు తయారు చేస్తోంది. అందులోని కొన్ని వివరాలతో ‘వెలుగు’ పేపర్ గురువారం ప్రచురించిన కథనం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేయిస్తున్న ఎంక్వైరీ వివరాలు తెలుసుకునేందుకు అక్రమార్కులు వివిధ మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎక్కడికి దారితీస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. కాగా, బీఆర్ఎస్ సర్కార్ హయాంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని, అదంతా కక్కిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో కబ్జాకు గురైన భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందా? లేక వేరే ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అని ఆక్రమణదారుల్లో భయం మొదలైంది.

క్రమబద్ధీకరణ భూములపైనా దృష్టి..  

జీవో నెంబర్ 59 కింద రెగ్యులరైజ్ అయిన భూములపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన నాటి బీఆర్ఎస్ సర్కార్​2014 డిసెంబర్​లో 59 జీవో తీసుకొచ్చింది. వివాదాస్పదం కాని ప్రభుత్వ, మిగులు భూముల్లోని ఆక్రమణలను రెగ్యులరైజ్​చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీని కోసం కొంత ఫీజు వసూలు చేసింది. మొదట 2014 జూన్​2కు ముందు ఉన్న ఆక్రమణలను రెగ్యులరైజ్​చేశారు. తర్వాత 2020 వరకు ఉన్న ఆక్రమణలను కూడా రెగ్యులరైజ్​చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీంతో చాలామంది బీఆర్ఎస్​నేతలు తమ ఆక్రమణలను నామమాత్రం చార్జీలతో రెగ్యులరైజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘించారు. కోట్లాది రూపాయల విలువైన భూములను బాజాప్తా బదలాయించుకున్నారు. ఇలాంటి భూములపై కూడా ప్రభుత్వం ఇప్పుడు దృష్టి సారించింది.