బీఆర్ఎస్ లో టికెట్ టెన్షన్.. టికెట్లపై దోబూచులాట

బీఆర్ఎస్ లో టికెట్ టెన్షన్.. టికెట్లపై దోబూచులాట
  •     మంచిర్యాల, బెల్లంపల్లి టికెట్లపై దోబూచులాట
  •     దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యపై ప్రజల్లో వ్యతిరేకత
  •     సర్వేలోనూ వారిపై నెగిటివ్ రిపోర్ట్
  •     మంచిర్యాల టికెట్​ రామ్మోహన్​ రావుకు ఇవ్వాలని కోరుతున్న ఆయన అనుచరులు

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల టికెట్లపై బీఆర్ఎస్ లో దోబూచులాట జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ను సీఎం కేసీఆర్ ఈ నెల 21న ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ రెండు నియోజకవర్గాలపైనే ఉంది. చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్​కు దాదాపు టికెట్ ఖరారు అయినట్టేనని ఆ పార్టీ వర్గాల సమాచారం.

అయితే మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు తాడిపల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం, బీఆర్ఎస్ సర్వేలో నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు తెలుస్తుండటంతో టికెట్లను ఎవరికి కేటాయిస్తారనే సందిగ్ధం నెలకొంది. మీడియాలో వస్తున్న వార్తలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టులో వీరిద్దరి పేర్లు లేకపోవడంతో వారితో పాటు అనుచరులు టెన్షన్ పడుతున్నారు. దీంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే హైదరాబాద్​లో మకాం వేసి ఎలాగైనా టికెట్ తెచ్చుకోవాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 

దివాకర్ రావు విజ్ఞప్తిని తిరస్కరించిన సీఎం!

మంచిర్యాల టికెట్ తనకు కాకుంటే తన కుమారుడికైనా కేటాయించాలని దివాకర్ రావు సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేయగా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఈసారి దివాకర్ రావును కేసీఆర్ పక్కకు తప్పించడం ఖాయమని వార్తలు వినిపిస్తుండటంతో తెలంగాణ ఫిలిం డెవలప్​మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఆ పార్టీ సీనియర్ లీడర్ పూస్కురు రామ్మోహన్​ రావు రంగంలోకి దిగారు. సీఎంతోపాటు మంత్రుల కేటీఆర్, హరీశ్ రావుతో ఆయనకు దగ్గర సంబంధాలు ఉండటంతో మంచిర్యాల టికెట్ ఎలాగైనా తనకే ఇస్తారని నమ్మకంతో ఉన్నారు. దీంతో కొద్దిరోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెన్నంటి ఉండడం తనకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. 

నాలుగుసార్లు గెలిచినా చేసిందేమీ లేదు

రామ్మోహన్ రావు మద్దతుదారులైన సీనియర్ అడ్వకేట్, ఉద్యమకారుడు సిరిపురం రాజేశ్, హాజీపూర్ జడ్పీటీసీ శిల్ప భర్త పూస్కురు శ్రీనివాసరావు తదితరులు మంచిర్యాలలోని ఆయన నివాసంలో శనివారం మీడియాతో మాట్లాడారు. మంచిర్యాల టికెట్​ను రామ్మోహన్​రావుకు కేటాయించాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. దివాకర్ రావు కాంగ్రెస్ నుంచి రెండు సార్లు, బీఆర్ఎస్ నుంచి మరో రెండు సార్లు గెలిచినప్పటికీ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఆరోపించారు.

గతంలో కాంగ్రెస్​లో తన వెంట ఉన్న కొంత మందికి మాత్రమే పెద్దపీట వేస్తూ ఉద్యమకారులను అణిచివేశాడని విమర్శించారు. ఆయనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నందున ఈసారి టికెట్ ఇస్తే ఇక్కడ పార్టీ ఓటమి తప్పదన్నారు. విద్యావంతుడు, ఉద్యమకారుడు, క్లీన్ ఇమేజ్ కలిగిన రామ్మోహన్​ రావుకు టికెట్ ఇస్తే సునాయాసంగా గెలిపిస్తామని కేసీఆర్​కు విన్నవించారు.

పడిపోయిన చిన్నయ్య గ్రాఫ్

ఇక బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మళ్లీ టికెట్ ఇచ్చే అవకాశాలు అనుమానంగానే కనిపిస్తున్నాయి. ఆరిజిన్ డెయిరీ శేజల్ లైంగిక ఆరోపణలతో చిన్నయ్య గ్రాఫ్ బాగా పడిపోయినట్లు అధిష్ఠానం సైతం భావిస్తోంది. పార్టీ సర్వేలో కూడా ఇదే విషయం స్పష్టమైనట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో చిన్నయ్యను పక్కనపెట్టి ఉద్యమకారుడైన రేణిగుంట్ల ప్రవీణ్​ను లేదా కొత్త అభ్యర్థిని బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. అయితే చిన్నయ్యకు టికెట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్​కు ఓ మంత్రి సిఫారసు చేసినట్టు సమాచారం. ఏదేమైనా ఈ నెల 21న బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ ప్రకటించే వరకు ఎదురుచూడాల్సిందే.