కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత
  •     బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం
  •     సర్ధిచెప్పిన విప్ అడ్లూరి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల, వెలుగు : జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో ఆఫీస్ లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శనివారం బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా చైర్ పర్సన్ అడువాల జ్యోతి మాట్లాడుతూ ముందస్తుగా దరఖాస్తు చేసుకుంటే పెళ్లి వరకు కాంగ్రెస్​ ప్రభుత్వం తులం బంగారంతో సహా రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తుందని వివరించారు. 

దీనిపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ తులం బంగారంపై ఎలాంటి విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించకుండా లబ్ధిదారులకు ఎలా అందజేస్తారో చెప్పాలన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు స్టేజీ కింది నుంచి బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా ఇచ్చారో అదేవిధంగా ఇస్తామంటూ సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడేప్పుడు కాంగ్రెస్ శ్రేణులు జోక్యం చేసుకోవడమేంటని బీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం చెప్పడంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 

ఈ వాగ్వాదం కాస్తా ఘర్షణ వరకు వెళ్లడంతో వెంటనే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కలుగజేసుకుని కాంగ్రెస్ శ్రేణులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అలాగే ఎమ్మెల్యే కు గౌరవం ఇవ్వకుండా ఫ్లెక్సీలో ఆయన ఫొటో కూడా ఏర్పాటు చేయలేదని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. అక్కడే ఉన్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ ఫ్లెక్సీలో కేవలం సీఎం రేవంత్ రెడ్డి ఫొటో మాత్రమే ఉందని, తన ఫొటో కూడా ఫ్లెక్సీలో లేదన్నారు. ప్రొటో కాల్ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. ఒకవైపు నాయకులు, మరోవైపు పోలీసులు సర్దిచెప్పడంతో ఇరువర్గాలు శాంతించాయి. 
 

చీరల పంపిణీపై కాంగ్రెస్ క్యాడర్ గరం.. 
 

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం అనంతరం బీఆర్ఎస్ నాయకులు చీరలను పంపిణీ చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో కేసీఆర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫొటోలు ఉన్న చీరలను పంపిణీ చేయడంపై ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చీరలు ఉన్న కారును సీజ్ చేయాలని కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. తమ కు చీరలు ఇచ్చిన తర్వాత కారును తీసుకెళ్లాలని మహిళలు కారును అడ్డుకున్నారు. పోలీసులు చీరలు ఉన్న కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు.