జనగామ మున్సిపాలిటీలో గందరగోళం 

జనగామ మున్సిపాలిటీలో గందరగోళం 

జనగామ, వెలుగు : జనగామ మున్సిపాలిటీ మీటింగ్ వాగ్వాదాల మధ్య గందరగోళంగా ముగిసింది. పోడియంపై చైర్ పర్సన్ కడకంచి బాలమణి, కమిషనర్​ మహేశ్వర్ రెడ్డి కూర్చున్నారు. 30 మంది కౌన్సిలర్లు ఉండగా, 8 మంది కాంగ్రెస్, ముగ్గురు బీఆర్ఎస్​ కౌన్సిలర్లు ప్రారంభం సమయానికి వచ్చారు. కోరం సమకూరడంతో 54 అంశాలతో కూడిన ఎజెండాను చైర్ పర్సన్ చర్చకు పెట్టారు. బీఆర్ఎస్​ కౌన్సిలర్లు మినహా మిగిలిన కాంగ్రెస్​ కౌన్సిలర్లు ఓకే చేయడంతో ఎజెండా పాస్ అయినట్టుగా ప్రకటించారు. కాగా, ఎజెండా అంశాలపై సమాచారం అందుకున్న బీఆర్ఎస్​ కౌన్సిలర్లు అందరూ మున్సిపాలిటీకి చేరుకొని, అంశాలను చదివి విన్పించాలని డిమాండ్​ చేశారు. అయితే కోరం ఉండడం వల్ల ఎజెండా అంశం ముగిసిపోయిందని కమిషనర్​ మహేశ్వర్​ రెడ్డి ప్రకటించారు.

దీంతో కోరం లేకున్నా మీటింగ్ ప్రారంభించడమే కాకుండా ఎజెండా ఎలా ఆమోదిస్తారని ప్రశ్నిస్తూ పోడియంను కౌన్సిలర్లు చుట్టుముట్టారు. చైర్​ పర్సన్​ బాలమణి, కమిషనర్ మహేశ్వర్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. చైర్ పర్సన్​ బాలమణి 'ఎజెండా అమోదం పొందింది. సమావేశం ముగిసింది' అని ప్రకటించి హాల్ నుంచి వెళ్లిపోయారు. అనంతరం కమిషనర్​ చాంబర్​కు చేరుకున్న కౌన్సిలర్లు ఆయనతో వాగ్వాదానికి దిగారు. కోరం లేకున్నా ఎజెండాను ఆమోదింప చేసుకున్నారని, మీటింగ్​ విజివల్స్ చూపించాలని డిమాండ్​ చేశారు. కమిషనర్ బయటకు వచ్చి కారులో వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. బీఆర్ఎస్​ కౌన్సిలర్లు కారుకు అడ్డంగా కూర్చుని నినాదాలు చేశారు. ఈ అంశాన్ని కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్తానని కమిషనర్​తెలిపారు.