
ములుగు, వెలుగు : జిల్లా కేంద్రమైన ములుగులో బీఆర్ఎస్, కాంగ్రెస్నేతల మధ్య పోటాపోటీగా ఆందోళనలు ర్యాలీలు జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు కొనసాగించారు. ముందుగా బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసు యాక్ట్ అమలులో ఉందని చెప్పిన వినకపోవడంతో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వారం రోజులుగా ములుగుకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా వేదికగా సవాళ్లు చేసుకుంటున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్నేతలు సోమవారం జిల్లా కేంద్రంలో ఆందోళనకు పిలుపునిచ్చారు. మరోవైపు గత పదేండ్ల పాలనలో బీఆర్ఎస్వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్యూత్ వింగ్ చలో ములుగుకు పిలుపునిచ్చింది. కాగా.. ఎస్పీ పి.శబరీష్జిల్లాలో నెల రోజులు పోలీస్యాక్ట్అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం కాంగ్రెస్, బీఆర్ఎస్నేతలతో సమావేశమైన డీఎస్పీ రవీందర్.. ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలకు అనుమతి లేదని, మంత్రుల పర్యటన ఉందని స్పష్టంచేశారు.
అయినా.. బీఆర్ఎస్నేతలు వినకుండా జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. అక్కడి నుంచి చౌరస్తాలోకి వెళ్లి ధర్నాకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయినా వినకుండా మరో రెండు సార్లు బస్టాండ్సమీపంలో, గణేశ్చౌక్సెంటర్ లో ఆందోళనకు యత్నించగా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి ఆందోళనకు మద్దతుగా పాల్గొనడంతో మరింత ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని మాజీ ఎమ్మెల్యేలు ఆరోపించారు.
ఇదే క్రమంలో జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క.. వాజేడు, వెంకటాపురంలో పర్యటించారు. కాంగ్రెస్శ్రేణులు జిల్లా కేంద్రంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి ఘటనలు జరుగకుండా ఎస్పీ ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ కిషోర్‌కుమార్, డీఎస్పీ రవీందర్, సీఐలు, ఎస్ ఐలు, సివిల్, స్పెషల్ బెటాలియన్ సిబ్బందితో భద్రతను పర్యవేక్షించారు.