నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత.. కాతకు వచ్చిన నిమ్మ తోటను తొలగించిన అధికారులు.. రైతుల ఆందోళన

నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత.. కాతకు వచ్చిన నిమ్మ తోటను తొలగించిన అధికారులు.. రైతుల ఆందోళన

నెల్లూరు జిల్లాలో ఉద్రక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాతకు వచ్చిన నిమ్మతోటను తొలగించాలని పోలీసులు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. జేసీబీలతో చెట్లను తొలగించాలని పోలీసులు ప్రయత్నించడంతో రైతులు అడ్డుకోవడంతో వాతావరణం టెన్షన్ టెన్షన్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. సైదాపురం మండలం మొలకలపూండ్ల గ్రామంలో పోలీసులు, రైతుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మొలకలపూండ్ల రెవిన్యూ పరిధిలో 793 సర్వే భూమిలో ఉన్న నిమ్మ తోటను తొలగించేందుకు శనివారం (జులై 26) పోలీసులు బందోబస్తుతో వచ్చారు.  టీడీపీ నేతల పిటీషన్‌ ఆధారంగారైతులకు నోటీసులు పంపిన  రెవెన్యూ అధికారులు.. చివరికి పోలీసు బందోబస్తుతో తోట తొలగించే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతలక దారి తీసింది.

అక్కడ దాదాపు 20 ఏళ్లుగా114 ఎకరాల ప్రభుత్వ భూమిలో గిరిజన రైతులు  సాగుచేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వ భూమిలో పంటలను తొలగించాల్సిందిగా రెవెన్యూ అధికారుల ఆదేశంతో సర్వే భూమిలో పోలీసులు భారీగా మోహరించారు. చేతికొచ్చిన నిమ్మ తోటలను జెసిబితో తొలగించారు. దీంతో రైతులు అడ్డుకోవడంతో వారిపై దాడికి చేసి కొట్టినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. పంటకొచ్చిన తోటను నాశనం చేయడం ద్వారా తమ పొట్టకొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 

నిమ్మ చెట్లు తీసేయొద్దని విన్నవించినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించారని  రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు భయం కలిగించే విధంగా  తరిమికొట్టారని వాపోతున్నారు.  అధికారుల తీరుకు నిరసనగా పొలాల వద్ద భారీ సంఖ్యలో గిరిజన రైతులు నిరసన చేపట్టారు. గిరిజనులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గిరిజనులు, రెవెన్యూ, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తమకు న్యాయం చేయాల్సిందిగా రైతులు అక్కడే బైఠాయించి నిరసన తెలియజేశారు.