హుజూర్ నగర్ లో ఇండిపెండెంట్ల దడ

హుజూర్ నగర్ లో ఇండిపెండెంట్ల దడ

హైదరాబాద్, వెలుగుహుజూర్ నగర్ బైపోల్‌లో  ప్రధాన పార్టీలకు ఇండిపెండెంట్లు, చిన్న చిన్న పార్టీల అభ్యర్థులు దడ పుట్టిస్తున్నారు. ముందెన్నడూ లేని విధంగా వారు ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. వీరి వల్ల ఎక్కడ తమ మెజార్టీ తగ్గుతుందోనని, ఎక్కడ తమ గెలుపునకు ఎసరు పడుతుందేమోనని ప్రధాన పార్టీలు భయపడుతున్నాయి. ఎలాగైనా తన సిట్టింగ్​ స్థానాన్ని కాపాడుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్​ ప్రయత్నిస్తుండగా.. ఈసారి గెలిచి తీరాలని అధికార టీఆర్​ఎస్​ ముందుకు వెళ్తోంది. బీజేపీ, టీడీపీ కూడా ఈ ఉప ఎన్నికను సవాల్​గా తీసుకున్నాయి. ప్రధాన పార్టీలకు హుజూర్​నగర్​ సీటు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఇండిపెండెంట్ల భయం కూడా వాటికి పట్టుకుంది. మొత్తంగా ఇక్కడ  28 మంది అభ్యర్థులు బరిలో నిలువగా.. వీరిలో ఇండిపెండెంట్లే 15 మంది.

స్థానిక సమస్యలపై ఫోకస్​

ఇండిపెండెంట్లు, చిన్న చిన్న పార్టీల అభ్యర్థులు ప్రధానంగా స్థానిక సమస్యలపై ఫోకస్​ పెట్టారు. ఇందులో ఇండ్ల,  భూ మాఫియా సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. ఇవే అస్త్రంగా ఇండిపెండెంట్లు ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. తమను గెలిపిస్తే సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఫేస్ బుక్, వాట్సప్ లో  వీడియో సందేశాలు పంపిస్తున్నారు.  ఇండిపెండెంట్లు కులం ఓట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. వీరు గనుక ఓట్లు భారీగా చీలిస్తే  ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం ఉంటుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

బుజ్జగింపులు

పోయిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ల వల్లే తమ మెజార్టీ తగ్గిందని కాంగ్రెస్​ భావిస్తోంది. తమ విజయానికి  ఎసరు పెట్టింది వీరేనని టీఆర్ఎస్ అభిప్రాయపడుతోంది. అందుకే ఈ సారి ఇండిపెండెంట్లను బుజ్జగించే పనిలో నేతలు నిమగ్నమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇండిపెండెంట్లు అధికార, ప్రతిపక్ష అభ్యర్థుల ఓట్లే  చీలుస్తారని, ఇది తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఇండిపెండెంట్లు చీలుస్తారని,  కాబట్టి తమకే మేలు జరుగుతుందని అధికార పార్టీ అంచనా వేస్తోంది. టీఆర్​ఎస్​కు సీపీఐ మద్దతిస్తుండగా.. సీపీఎం అభ్యర్థి నామినేషన్  తిరస్కరణకు గురైంది.

ఎవరి లెక్క వారిదే

కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి, టీఆర్​ఎస్​ అభ్యర్థి సైదిరెడ్డి, బీజేపీ అభ్యర్థి రామారావు, టీడీపీ అభ్యర్థి కిరణ్మయి పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. బీసీ ఓట్లపై బీజేపీ అభ్యర్థి రామారావు దృష్టి పెట్టారు. సంప్రదాయ ఓటుబ్యాంకుపై కాంగ్రెస్ ఫోకస్​ పెట్టింది. కేసీఆర్​ ప్రచారం కలిసి వస్తుందని టీఆర్​ఎస్​ భావిస్తోంది. పాత క్యాడర్  బలం కలిసి వస్తుందన్న అంచనాలో టీడీపీ  ఉంది.   రిజిస్టర్డ్​ పార్టీల తరఫున బరిలో ఉన్న వారిలో అజ్మీరా మహేశ్, కిరణ్​ వంగపల్లి, జాజుల భాస్కర్​, జానయ్య నందిపాటి, తగుళ్ల జనార్దన్, మామిడి సుదర్శన్, మేకల రఘుమారెడ్డి, వీసం రాములు, శాంతిదాస్​ రామ్​నాయక్​ ఉన్నారు. ఇండిపెండెంట్లలో ఆలుదాసు సుధాకర్​, కృష్ణానాయక్​ భూక్య, చిలివేరు శ్రీకాంత్​, తీన్మార్​ మల్లన్న, దేశగాని సాంబశివగౌడ్​, పండితి క్రాంతికుమార్​, టి.పాండుగౌడ్​, బండారు నాగరాజు, మారం వెంకట్​రెడ్డి, మేకల వెంకన్న, మేడి రమణ, లింగిడి వెంకటేశ్వర్లు, ఎన్​.వినోద్​కుమార్, సపావత్​ సుమన్​, సుమన్​ రాయిరాల ఉన్నారు.

మొత్తం అభ్యర్థులు 28 మంది

హుజూర్‌నగర్‌, వెలుగు: హుజూర్​నగర్​ ఉప ఎన్నిక బరిలో 28 మంది అభ్యర్థులు నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గురువారంతో ముగియడంతో పోటీలో ఉన్న వారి పేర్లను ఎన్నికల అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 23న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. అప్పటినుంచి సెప్టెంబర్​ 30 వరకు 76 మంది 119 సెట్ల నామినేషన్లు వేశారు.  వాటిని ఈ నెల 1 పరిశీలించారు. నామినేషన్​ దాఖలు చేసినవారిలో ఎక్కువ మంది కొత్తగా ఏర్పాటు చేసిన ఫామ్ 26 లో కాలమ్ పూర్తి చేయక, చిన్న చిన్న పొరపాట్ల వల్ల తిరస్కరణకు గురయ్యారు. ఇలాంటి కారణాలతోనే సీపీఎం అభ్యర్థి పారుపల్లి శేఖర్ రావు నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. గురువారం జరిగిన నామినేషన్ల ఉపసంహరణలో ముగ్గురు ఇండిపెండెంట్లు   స్వచ్ఛందంగా తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫైనల్ గా ఉప ఎన్నికలో  28 మంది  బరిలో ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి పి.చంద్రయ్య తెలిపారు. వీరిలో  వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు13, పార్టీలకు సంబంధం లేకుండా ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నవారు 15 మంది ఉన్నట్లు వెల్లడించారు.